చంద్రబాబు పాపాలు.. పాలమూరుకి శాపాలు
పాలమూరుని వలసల జిల్లాగా చంద్రబాబు మారిస్తే, వ్యవసాయ జిల్లాగా మార్చింది కేసీఆర్ అని చెప్పారు హరీష్ రావు.
పాలమూరు సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ లోపాలు, చంద్రబాబు పాపాలు.. మహబూబ్ నగర్‌కి శాపాలు అంటూ విమర్శించారాయన. మహబూబ్ నగర్ వెనకబాటుతనానికి కారణాలు చెప్పాలంటే ముందు చంద్రబాబుని తిట్టాలని, కాంగ్రెస్ ని నిందించాలని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పాలమూరు జిల్లాని పచ్చగా చేసింది కేసీఆర్ అని స్పష్టం చేశారు హరీష్ రావు. అలాంటి కేసీఆర్‌ని తిట్టడం రేవంత్ రెడ్డి అవివేకమన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి కాక మునుపు పాలమూరు ఎలా ఉండేదో, బీఆర్ఎస్ పాలనలో జిల్లా ఎలా మారిందో రేవంత్ రెడ్డి తేడా చూడాలని చెప్పారు హరీష్ రావు. వలసల జిల్లాగా పాలమూరుని మార్చింది కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు అని ఆరోపించారాయన. 1994- 2004 మధ్య రేవంత్ పాత గురువు చంద్రబాబు, మహబూబ్ నగర్ జిల్లాని దత్తత తీసుకుని ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. పాలమూరుని వలసల జిల్లాగా చంద్రబాబు మారిస్తే, వ్యవసాయ జిల్లాగా మార్చింది కేసీఆర్ అని చెప్పారు హరీష్ రావు.
కేసీఆర్ కిట్లు ఇస్తే..
— BRS Party (@BRSparty) March 7, 2024
రేవంత్ రెడ్డి తిట్లతో పోటీ పడుతున్నడు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. pic.twitter.com/WSsbxr8agI
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన 80 శాతం పూర్తి చేసింది కేసీఆరేనని చెప్పారు హరీష్ రావు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుకి బొక్క పెట్టి కృష్ణా జలాలు ఆంధ్రాకు తీసుకుపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం ధనయజ్ఞంలా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనలో 30 ఏళ్లల్లో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 13 వేల ఎకరాలకి నీరు అందిస్తే.. బీఆర్ఎస్ హయాంలో 3 లక్షల ఎకరాలకి నీరిచ్చామని చెప్పారు. రేవంత్ గొంతు పెద్దగా చేసినంత మాత్రాన అబద్దాలు నిజం కావన్నారు.
నీ హైటెంత..?
తన హైట్ గురించి రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్నారని, అసలు రేవంత్ ఎత్తు గురించి తానెప్పుడైనా మాట్లాడానా అని ప్రశ్నించారు హరీష్ రావు. ఎత్తు, బరువు ప్రజలకు అవసరం లేదని, నాయకుల చిత్తశుద్ధి మాత్రమే వారికి అవసరం అని అన్నారు. రేవంత్ రెడ్డి భాష సరిగా లేదని, ఒక ముఖ్యమంత్రి అలాగే మాట్లాడతారా అని నిలదీశారు. కేసీఆర్ తన పాలనలో కిట్లు తీసుకొస్తే, రేవంత్ తిట్లలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు హరీష్ రావు.