Telugu Global
Telangana

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై హరీష్ రావు అదిరిపోయే కౌంటర్

'గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం' అన్నట్టుగా కాంగ్రెస్ బూటకపు హామీలు ఇచ్చిందని సెటైర్లు వేశారు హరీష్ రావు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై హరీష్ రావు అదిరిపోయే కౌంటర్
X

ఏ కోణంలో చూసినా కాంగ్రెస్ లో కుంభకోణమే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై అదిరిపోయే కౌంటర్ వేశారు. తెలంగాణలో గెలిచే పరిస్థితి లేదు అని తెలిసిన తర్వాతే కాంగ్రెస్ నేతలు అలవికాని హామీలు ఇచ్చారని చెప్పారు. 'గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం' అన్నట్టుగా కాంగ్రెస్ బూటకపు హామీలు ఇచ్చిందని సెటైర్లు వేశారు హరీష్ రావు.


అలవికాని హామీలు, అసత్య ఆరోపణలు, చరిత్ర వక్రీకరణలు, ఆత్మవంచన, పరనిందలతో తుక్కుగూడలో కాంగ్రెస్‌ సభ జరిగిందని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కొన్నిటిని తీసుకుని గ్యారెంటీలనే పేరుతో కాంగ్రెస్ కాపీకొట్టిందని చెప్పారు. రాహుల్‌ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శంచారు. తెలంగాణ ఎవరి దయతోనూ రాలేదని, ప్రజలు పోరాడి గెలుచుకున్నారని వివరించారు.

ఆ హామీల విలువ 44 ఎంపీ సీట్లు..

2014లో కాంగ్రెస్‌ బూటకపు హామీలు ఇస్తే దేశవ్యాప్తంగా 44 ఎంపీ సీట్లు వచ్చాయని కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ఇటీవల కర్నాటకలో కూడా ఇలాగే అలవికాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఆ హామీలను అమలు చేయలేక వంద రోజుల్లోనే ప్రభుత్వం ఆగమాగం అవుతోందని ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ జాతీయ పార్టీయా లేక ప్రాంతీయ పార్టీయా అని ప్రశ్నించారు. నిజంగానే జాతీయ పార్టీ అయితే.. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ గ్యారంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రజలకు ఈ గ్యారెంటీలు అక్కర్లేదా అన్నారు హరీష్ రావు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ విపక్షాలకే మద్దతిచ్చిందని అన్నారు మంత్రి హరీష్. హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీతో కుమ్మక్కయిందన్నారు. ఈడీ, సీబీఐ వేటకుక్కల్లా తమ నేతలను వేధిస్తున్నా వారికి లొంగేది లేదన్నారు. కాంగ్రెస్ మాత్రం బీజేపీతో రాజీ కుదుర్చుకుందని, అందుకే నేషనల్‌ హెరాల్డ్‌ కేసు అటకెక్కిందని అన్నారు హరీష్ రావు.

First Published:  18 Sept 2023 7:26 AM IST
Next Story