Telugu Global
Telangana

పథకం మాది, గొప్పలు మీవా..? రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్

కాంగ్రెస్ పథకాల ద్వారానే ప్రజలకు మేలు జరుగుతున్నట్టు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం అని అన్నారు హరీష్ రావు.

పథకం మాది, గొప్పలు మీవా..? రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
X

సీఎం రేవంత్ రెడ్డి తాజా ట్వీట్ కి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను, పనులను.. కాంగ్రెస్ నేతలు తమ ఖాతాలో వేసుకోవడం శోచనీయం అని అన్నారాయన. కాంగ్రెస్ పథకాల ద్వారానే ప్రజలకు మేలు జరుగుతున్నట్టు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం అని అన్నారు హరీష్ రావు.

ఎందుకీ గొడవ..?

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం పథకం ద్వారా ప్రభుత్వ స్కూల్ విద్యార్థినులు లాభపడ్డారంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికల ఫొటోలను ఆయన తన ట్వీట్ కి జతచేశారు. ఆ బాలికలను చూస్తుంటే తనకు ఆనందంగా ఉందన్నారు. ఊరికి కిలో మీటర్ దూరంలో ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వారు వెళ్లగలుగుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం వల్ల తాము ఉచితంగా బస్సెక్కి స్కూల్ కు వెళ్లగలుగుతున్నామని వారు తమ చేతుల్లోని ఆధార్ కార్డులు చూపెట్టారని, ఆ ఫొటోలకు కామెంట్ జతచేశారు. ఒక జర్నలిస్టు మిత్రుడు ఈ ఫొటోలను తనకు పంపారంటూ ట్విట్టర్లో షేర్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.


అయితే స్కూల్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచే అమలులో ఉందని గుర్తు చేశారు హరీష్ రావు. ఇప్పుడు కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి తమ వల్లే విద్యార్థినులకు ఉచిత ప్రయాణ సౌకర్యం లభించిందని చెప్పుకోవడం హాస్యాస్పదం అని అన్నారాయన. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు తెచ్చుకున్నవారికి రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చి.. ఆ ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకున్నారనే విమర్శలు వినిపించాయి. ఇప్పుడు ఉచిత రవాణా పథకంపై కూడా ఇలాంటి చర్చే మొదలైంది.

First Published:  15 Jun 2024 8:43 AM IST
Next Story