Telugu Global
Telangana

గూడెం పోయినా గుండె ధైర్యాన్ని కోల్పోవద్దు..

మూడుసార్లు మహిపాల్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామని, గెలిపించుకున్నామని, గౌరవించామని.. పార్టీ మారేందుకు ఆయనకు మనసెలా వచ్చిందన్నారు హరీష్ రావు.

గూడెం పోయినా గుండె ధైర్యాన్ని కోల్పోవద్దు..
X

ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని, అప్పుడు తమ పార్టీ పనైపోయిందని చాలామంది కామెంట్ చేశారని.. కానీ ఏమీ కాలేదని, ఏమీ చేయలేకపోయారని గుర్తు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లాగేసుకుంటుందని, దీని వల్ల పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదన్నారాయన. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ని వదిలినా కార్యకర్తలు మాత్రం గుండె ధైర్యం కోల్పోవద్దని చెప్పారు. బీఆర్ఎస్ నమ్ముకున్నది కార్యకర్తలు, ప్రజలనేనని అన్నారాయన.


పటాన్ చెరు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు హరీష్ రావు. మహిపాల్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారాయన. మూడుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామని, గెలిపించుకున్నామని, గౌరవించామని.. పార్టీ మారేందుకు ఆయనకు మనసెలా వచ్చిందన్నారు. వైసీపీలో అవకాశం రాక ఇబ్బంది పడిన సందర్భంలో ఆయనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి గౌరవించింది గుర్తు చేశారు. పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదని, కార్యకర్తలు ముఖ్యమని చెప్పారు. అర్థరాత్రి ఆపద అని తన వద్దకు వచ్చినా కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు హరీష్ రావు.

పార్టీ మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని నాడు రేవంత్ రెడ్డి అన్నారని, అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపడ్డారు హరీష్ రావు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తాము వదిలిపెట్టబోమన్నారు. వారిని మాజీలుగా చేసేందుకు పనిచేస్తామన్నారు. వారి రాజకీయ భవిష్యత్తుని వారే నాశనం చేసుకున్నారని తేల్చి చెప్పారు హరీష్ రావు. మరోవైపు గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో పటాన్ చెరు కాంగ్రెస్ లో లుకలుకలు మొదలైనట్టు తెలుస్తోంది. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

First Published:  17 July 2024 7:27 AM GMT
Next Story