100రోజులు కాలేదని ఆగాం.. లేకపోతే చీల్చి చెండాడే వాళ్లం
దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగ అని ప్రతిపక్షంలో ఉండగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారని, మరిప్పుడు కాంగ్రెస్ టీమ్ దావోస్ వెళ్లిందని.. ఉత్తమ్ ఇప్పుడేమంటారని ప్రశ్నించారు హరీష్ రావు.
ఆరు గ్యారెంటీల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన 100 రోజుల గడువు ఇంకా పూర్తి కాలేదని తామంతా ఆగామని, లేకపోతే కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడే వాళ్లమని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. కొన్ని రోజులు పోతే, బీఆర్ఎస్ నేతల్ని ప్రజలే బయటకు తీసుకువస్తారని, పోరాటాలకు నాయకత్వం వహించాలంటారని చెప్పారు. ఆరోజులు త్వరలోనే వస్తాయని, కాంగ్రెస్ నేతలు వేచి చూడాలన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన నాగర్ కర్నూలు పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
తెలంగాణ భవన్ లో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం
— BRS Party (@BRSparty) January 17, 2024
ఈ సమావేశంలో మాజీ మంత్రులు @BRSHarish, @SingireddyBRS, @VSrinivasGoud, @VPR_BRS, మాజీ స్పీకర్ లు @PocharamBRS, మధుసూధనాచారి, ఎంపీ పి. రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం… pic.twitter.com/TPZEKm9Hmf
తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తండ్లాడినా.. అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డామంటూ ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు హరీష్ రావు. కానీ తాము పుంజుకుంటామని, తిరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లు కాకముందే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు హరీష్. కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రాల్లో వరసగా పదేళ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదు అన్నారు. ఆ ఆనవాయితీ తెలంగాణలో కూడా రిపీటవుతుందని చెప్పారు. ఎలాగూ అధికారం రాదు అనే ఉద్దేశంతోటే అరచేతిలో వైకుంఠం చూపేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిందని.. కానీ ఆరు గ్యారెంటీలను అమలు చేయడం కష్టసాధ్యమని చెప్పారు. మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని ఎద్దేవా చేశారు హరీష్ రావు.
దావోస్ పై ఉత్తమ్ ఇప్పుడేమంటారు..?
దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగ అని ప్రతిపక్షంలో ఉండగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారని, మరిప్పుడు కాంగ్రెస్ టీమ్ దావోస్ వెళ్లిందని.. ఉత్తమ్ ఇప్పుడేమంటారని ప్రశ్నించారు హరీష్ రావు. తెలంగాణ అప్పుల్లో ఉందంటూ విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు.. దావోస్ లో ఏం చెప్పి పెట్టుబడులు ఆహ్వానిస్తారని అడిగారు. రాష్ట్రం అప్పుల్లో ఉంది.. పెట్టుబడులకు రావొద్దు అని పారిశ్రామిక వేత్తలకు చెబుతారా అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు హరీష్.