Telugu Global
Telangana

తప్పుడు ప్రచారాన్ని ఖండించిన హరీష్ రావు

అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగుల పక్షాన గొంతెత్తానని చెప్పారు హరీష్. ఎల్లపుడూ ఉద్యోగుల హక్కులకోసం పోరాడే తనపై కొందరు కావాలని దుష్ప్రచారం మొదలు పెట్టారన్నారు.

తప్పుడు ప్రచారాన్ని ఖండించిన హరీష్ రావు
X

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆ ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈమేరకు ఆయన ఓ ట్వీట్ వేశారు. త‌న ప్రసంగాన్ని తప్పు అర్థం వచ్చేలా ప్రచురించిన కొన్ని మీడియా సంస్థలకు సమాచారం ఇచ్చి ఆ వార్తల్ని సరిచేయించానని అన్నారు. అయినా కూడా కొందరు కావాలని ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతకీ హరీష్ ఏమన్నారు..?

కేసీఆర్ హయాంలో ఉద్యోగులకు జీతాలు ఆలస్యమయ్యాయనే ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జీతాల విషయంలో సమయపాలన పాటించే నెపంతో రైతుభరోసా ఆలస్యం చేస్తోందని అన్నారు హరీష్ రావు. అయితే దీన్ని వక్రీకరించి కొంతమంది వార్తలిచ్చారు. ఉద్యోగులకు జీతాలు ఒకటో తేదీ ఇవ్వడం హరీష్ రావుకి ఇష్టం లేదన్నట్టుగా ఆయన మాటలకు పెడర్థాలు తీశారు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ కావడంతో చివరకు హరీష్ రావు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అసలు ప్రభుత్వ ఉద్యోగుల తరపున కొట్లాడింది తానేనని చెప్పారు హరీష్ రావు. ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామనే ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే నిలదీశానని, అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగుల పక్షాన గొంతెత్తానని చెప్పారు హరీష్. ఎల్లపుడూ ఉద్యోగుల హక్కులకోసం పోరాడే తనపై కొందరు కావాలని దుష్ప్రచారం మొదలు పెట్టారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.


ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా సిద్ధిపేటలో 800 మంది మ‌హిళ‌ల‌కు ఉచితంగా కుట్టు మిష‌న్లు పంపిణీ చేశారు హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 2200మందికి ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చామని చెప్పారాయన. మహిళల కోసం గత ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిందన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా కుటుంబ సభ్యునిలాగా మహిళలకోసం పనిచేస్తున్నానని చెప్పారు హరీష్ రావు.

First Published:  8 March 2024 7:21 PM IST
Next Story