ప్రియాంకమ్మా.. తులం బంగారం ఏమైంది?
అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లకు కేసీఆర్ ఇచ్చే లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే తులం బంగారం ఇచ్చే జిమ్మేదార్ నాది అన్నారు. మరి ఏమైందమ్మా ప్రియాంక గాంధీ తులం బంగారం సంగతి?.
అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటి అమలును గాలికొదిలేశారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఇస్తామన్న తులం బంగారం హామీ ఏమైందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని సూటిగా ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు.
"అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీదే చేస్తామన్నారు. అసెంబ్లీలో ఆ గ్యారంటీలకు చట్టబద్దత కూడా చేస్తామన్నారు. కానీ ఏది జరగలేదు. ఇదే కోస్గిలో ప్రియాంక గాంధీ వచ్చి ఏం మాట్లాడారు?. అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లకు కేసీఆర్ ఇచ్చే లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే తులం బంగారం ఇచ్చే జిమ్మేదార్ నాది అన్నారు. మరి ఏమైందమ్మా ప్రియాంక గాంధీ తులం బంగారం సంగతి?. ఇప్పుడు పెళ్లీల సీజన్ నడుస్తోంది. మార్చి, ఏప్రిల్‌లో మస్తు పెళ్లీలు అయ్యాయి. కొడంగల్‌లో ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా?. మరి ఇప్పుడు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు?. తులం బంగారం ఇస్తామన్న రేవంత్, ప్రియాంక ఎక్కడికి పోయారు?. ఇది మోసం కాదా?" అని హరీశ్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
"రూ. 2 లక్షల రుణమాఫీ, బోనస్ 500, రైతుబంధు రూ. 15 వేలు, కౌలు రైతులకు రూ. 15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు, 24 గంటల కరెంట్ అన్ని మోసమే. ఒక్కటి కూడా అమలు చేయలేదు. మోసం చేసిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. రుణమాఫీ అయిన వాళ్లంతా కాంగ్రెస్‌కు ఓటేయండి. రుణమాఫీ కానోళ్లంతా కారు గుర్తుకు ఓటేయండి" అన్నారు హరీష్‌రావు.