Telugu Global
Telangana

నీ రాజకీయాల కోసం రైతుల్ని ఇబ్బంది పెట్టకు రేవంత్‌

కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజే కాదు కదా. కాళేశ్వరంలో అనేక రిజర్వాయర్లున్నాయి. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగ నాయక్‌ సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, మిడ్‌ మానేరు రిజర్వాయర్ ఇవన్నీ ఉన్నాయి.

నీ రాజకీయాల కోసం రైతుల్ని ఇబ్బంది పెట్టకు రేవంత్‌
X

మేడిగడ్డ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం, మంత్రులు మధ్యలో రంగ నాయక్ సాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్, గలగలా పారుతున్న కూడవెల్లి వాగును కూడా ప‌రిశీలించాలని కోరారు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు. "తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోండి. వెంటనే బ్యారేజీని పునరుద్ధరించే పని చేయండి. కానీ, అది మానేసి గత ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకుని కాలయాపన చేస్తున్నారు. ఇవాళ కూడా నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నా, రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు. జూన్‌, జూలైలో వర్షాలు వస్తాయి. వెంటనే ప్రాజెక్టును రీస్టోర్ చేసే ప్రయత్నం చేయండి. లేదంటే రైతులకు ఇబ్బంది అవుతుంది".

"కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజే కాదు కదా. కాళేశ్వరంలో అనేక రిజర్వాయర్లున్నాయి. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగ నాయక్‌ సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, మిడ్‌ మానేరు రిజర్వాయర్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటిని అద్భుతంగా నిర్మించి, రైతులకు నీళ్లందించాం. ఒక మేడిగడ్డనే తీసుకుని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. దానిమీద ఎంక్వైరీ చేయండి. కఠిన చర్యలు తీసుకోండి. మేమేం వద్దంటలేం. కానీ ప్రాజెక్టును త్వరగా పునరుద్ధరించండి. మీ రాజకీయాల కోసం రైతులను ఇబ్బంది పెట్టే పని చేయకండి".

"గతంలో కాంగ్రెస్‌ హయంలో పంజాగుట్ట ఫ్లై ఓవర్ కడుతుండగానే కూలిపోయి 20 మంది చనిపోయారు. మీ హయంలోనూ ఫ్లై ఓవర్లు కూలిపోయాయి కదా. గతంలో పుట్టంగండి రిజర్వాయర్‌ ప్రారంభించిన రోజే నీళ్లు బయటకు పోతే వెంటనే బంద్ చేశారు కదా. ఆనాడు దేవాదులలో కూడా మేం పంపులు ఆన్ చేయగానే పటాకుల్లాగా పైపులు పేలిపోయి ఆకాశంలోకి ఎగిరినయ్. మేం దాన్ని రెక్టిఫై చేసినం కదా. తప్పు జరిగినప్పుడు తప్పకుండా రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ మీరు భూతద్దంలో పెట్టి, దివాళాకోరు రాజకీయం చేస్తున్నారు. మేం నల్గొండలో సభ పెట్టే వరకు మీరు మొద్దు నిద్రలో ఉన్నరు. ఇప్పుడు లేచి నానా యాగి చేస్తున్నారు" అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు హరీశ్‌రావు.

First Published:  13 Feb 2024 2:21 PM IST
Next Story