Telugu Global
Telangana

నమ్మకానికి కేసీఆర్.. నయవంచనకు కాంగ్రెస్

రేపు సిద్దిపేటలో జరిగే బీఆర్ఎస్ ఆశీర్వాద సభను లక్షమందితో నిర్వహిస్తామని చెప్పారు మంత్రి హరీష్ రావు. 20వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

నమ్మకానికి కేసీఆర్.. నయవంచనకు కాంగ్రెస్
X

నమ్మకానికి మారుపేరు కేసీఆర్ అని, నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ మాటల్ని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారాయన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీ భవన్ లో జరుగుతున్న ఫైటింగ్ సీన్లను అందరూ చూస్తున్నారని గుర్తు చేశారు. మేనిఫెస్టో కాపీకొట్టింది బీఆర్ఎస్ కాదని, కాంగ్రెస్సేనని చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో చూడగానే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోయాయని అన్నారు. వాళ్లకు ఏం మాట్లాడాలో అర్థం కాక, కాపీ అంటూ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. ఎన్నికల సమయంలో అలాంటి నాయకుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.


లక్షమందితో సభ.. 20వేల బైక్ లతో ర్యాలీ

రేపు సిద్దిపేటలో జరిగే బీఆర్ఎస్ ఆశీర్వాద సభను లక్షమందితో నిర్వహిస్తామని చెప్పారు మంత్రి హరీష్ రావు. 20వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ ముందుందని, మిగతా పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించడానికే తంటాలు పడుతున్నాయని కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వ పని తీరును ఢిల్లీ స్థాయిలో ప్రశంసిస్తారని.. కానీ ఓట్ల కోసం తెలంగాణ గల్లీల్లో వచ్చి విమర్శలు చేస్తారని విమర్శించారు మంత్రి హరీష్ రావు. ఢిల్లీలో మీరు చెప్పిన మాటలు నిజమా, గల్లీలో చేస్తున్న విమర్శలు నిజమా అని బీజేపీ నేతల్ని ప్రశ్నించారు. ప్రజలు అమాయకులు కాదని.. అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని, హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు.

First Published:  16 Oct 2023 6:51 PM IST
Next Story