Telugu Global
Telangana

వాళ్ల హైకమాండ్ ఢిల్లీ.. మన హైకమాండ్ గల్లీ

తెలంగాణపై విషం చిమ్మడం మానాలని హితవు పలికారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో సంబరం చేసుకోలేదు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీష్ రావు.

వాళ్ల హైకమాండ్ ఢిల్లీ.. మన హైకమాండ్ గల్లీ
X

కాంగ్రెస్ నేతలయినా, బీజేపీ నేతలయినా నేరుగా ఢిల్లీకి పోతారని.. వారి హైకమాండ్ ఢిల్లీ అయితే, మన హైకమాండ్ గల్లీలో ఉండే ప్రజలేనని అన్నారు మంత్రి హరీష్ రావు. ప్రధాని మోదీ ఎప్పుడు అవకాశం దొరికినా తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో సంబురాలు చేసుకోలేదని అంటున్నారని.. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉండదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఊరు, వాడా సంబురం చేసుకుందని చెప్పారు. కానీ, మోదీ మాత్రం పండగ చేసుకోలేదంటూ కడుపులో విషం కక్కుతున్నారని ఆరోపించారు. వేరుపడ్డ తొలి రోజుల్లోనే 7 మండలాలను ఏపీలో కలిపి తెలంగాణకు అన్యాయం చేశారని, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఆంధ్రాకు అప్పజెప్పి మోదీ తెలంగాణకు మోసం చేశారన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు, గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా? అని నిలదీశారు హరీష్ రావు.

తెలంగాణ ఏర్పాటు కావడం వల్లే దేశంలోనే రాష్ట్ర తలసరి ఆదాయం నెంబర్‌-1 గా ఉందని చెప్పారు హరీష్ రావు. ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ మొత్తంగా 2లక్షలు కూడా ఇవ్వలేదన్నారు. అలాంటివారు తెలంగాణపై విషం చిమ్మడం మానాలని హితవు పలికారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో సంబరం చేసుకోలేదు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీష్ రావు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకంటే..

కర్నాటక రైతులు అక్కడ గిట్టుబాటు ధరలు లేక.. అక్కడినుంచి ఇక్కడికి వచ్చి పంటను అమ్ముకుని వెళ్తున్నారని చెప్పారు హరీష్ రావు. అక్కడ ఉన్నది కాంగ్రెస్ అని, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ గ్యారంటీలంటూ మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్నాటకలో ఆసరా పింఛన్లు ఎంత ఇస్తున్నారు, తెలంగాణలో పింఛన్లు ఎంత పెరిగాయి అనే విషయం ప్రజలు గుర్తించాలన్నారు. కర్నాటకలో 10 కిలోల బియ్యం ఇస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు అన్నారని, ఉన్న బస్‌ ను బంద్‌ పెట్టారన్నారు. ఉచిత కరెంటు అని చెప్పి.. కరెంట్‌ బిల్లును డబుల్ చేశారని విమర్శించారు. దమ్ముంటే కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో ముందుగా ఆ హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు హరీష్ రావు.

First Published:  19 Sept 2023 9:10 PM IST
Next Story