Telugu Global
Telangana

నారాయణపేట ఎస్పీ కూతురు హారతికి సివిల్స్‌లో 3వ ర్యాంక్

తెలంగాణ సీఐడీ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ శిక్షణ ఇచ్చిన విద్యార్థుల్లో 125 మందికి మంచి ర్యాంకులు వచ్చాయి.

నారాయణపేట ఎస్పీ కూతురు హారతికి సివిల్స్‌లో 3వ ర్యాంక్
X

ఐఏఎస్, ఐపీఎస్ సహా ఇతర సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం యూపీఎస్సీ చేపట్టే పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. సివిల్స్-2022లో తెలంగాణకు చెందిన నూకల ఉమా హారతి ఆలిండియా మూడవ ర్యాంకు సాధించింది. ఉమా హారతి తండ్రి నూకల వెంకటేశ్వర్లు నారాయణపేట జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన ఉమా హారతి.. ఐఐటీ హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

గ్రాడ్యుయేషన్ తర్వాత పూర్తిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలపై దృష్టి పెట్టారు. మూడు సార్లు విఫలం అయినా మొక్కవోని విశ్వాసంతో నాలుగో సారి రాసి.. ఏకంగా 3వ ర్యాంకు సాధించడం గమనార్హం. హారతి సోదరుడు సాయి వికాస్ కూడా 2021లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకొని ఈ నెలలోనే విధుల్లో చేరాడు. కాగా, యూపీఎస్పీ ఫలితాల్లో తమ కూతురు ఆలిండియా 3వ ర్యాంకు సాధించడంపై ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆయన భార్య శ్రీదేవి సంతోషంలో మునిగితేలుతున్నారు. కాగా, ఉమా హారతికి బంధువుల, స్నేహితులు, సన్నిహితుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

తెలుగు విద్యార్థులకు ర్యాంకులు..

యూపీఎస్సీ విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. తిరుపతికి చెందిన పవన్ దత్తాకు ఆలిండియా స్థాయిలో 22వ ర్యాంకు వచ్చింది. హర్షిత్‌కు 40వ ర్యాంక్, పవన్‌కు 55, అర్నవ్ మిశ్రాకు 56, సాయి ప్రణవ్‌కు 62వ ర్యాంకు వచ్చింది. తెలంగాణ విద్యార్థి ఉత్కర్ష్ కుమార్‌కు 78వ ర్యాంకు వచ్చింది. కరీంనగర్‌కు చెందిన సాయికృష్ణ ఆలిండియా స్థాయిలో 94వ ర్యాంకు సాధించాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి చెందిన ఏనుగు శివ మారుతి రెడ్డి 132వ ర్యాంకు, కుమ్రం భీం జిల్లా రెబ్బన మండలానికి చెందిన డోంగ్రి రేవయ్యకు జాతీయ స్థాయిలో 410వ ర్యాంక్ వచ్చింది.

మహేశ్ భగవత్ శిక్షణ ఇచ్చిన వారిలో 125 మందికి ర్యాంకులు..

తెలంగాణ సీఐడీ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ శిక్షణ ఇచ్చిన విద్యార్థుల్లో 125 మందికి మంచి ర్యాంకులు వచ్చాయి. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ప్రతీ ఏడాది యూపీఎస్సీ ఔత్సాహికులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వ్యూకు విద్యార్థులను ప్రిపేర్ చేస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నారు. ఆలిండియా సివిల్ 1వ ర్యాంకు సాధించిన ఇషితా కిశోర్.. భగవత్ దగ్గర శిక్షణ తీసుకోవడం గమనార్హం. ఈ ఏడాది 125 మందికి మంచి ర్యాంకులు వచ్చినట్లు స్వయంగా భగవత్ తెలియజేశారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులందరూ నిస్వార్థంతో సేవ చేయాలని సూచించారు.

First Published:  23 May 2023 7:23 PM IST
Next Story