Telugu Global
Telangana

చేనేతల ఆత్మహత్యలు.. రేవంత్‌కు కేటీఆర్‌ రిక్వెస్ట్‌!

బీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాలుగా అమలు చేసిన బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

చేనేతల ఆత్మహత్యలు.. రేవంత్‌కు కేటీఆర్‌ రిక్వెస్ట్‌!
X

మళ్లీ సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ‌త ప్రభుత్వం చేనేతలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో బతుకమ్మ చీరల స్కీమ్‌ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ ప‌థ‌కాన్ని అటకెక్కించినట్లు తెలుస్తోంది. దీంతో ఉపాధి లేక కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గత కొన్ని రోజుల వ్యవధిలోనే సిరిసిల్లలో 10 మంది చేనేత కార్మికులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.


చేనేత కార్మికుల ఆత్మహత్యలపై మరోసారి రేవంత్ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్వీట్ చేశారు. చేనేత కార్మికులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో మరణశాసనం రాస్తోందని మండిపడ్డారు. పేద చేనేత కార్మికులను కష్టాల్లోకి నెట్టడంతో పాటు.. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాలుగా అమలు చేసిన బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గతంలో ప్రతి సంవత్సరం.. BRS ప్రభుత్వం దసరా, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా కోటి చీరలను పంపిణీ చేసిందని గుర్తుచేశారు కేటీఆర్.

బతుకమ్మ చీరల పంపిణీకి ఏడాది బడ్జెట్ కేవలం రూ. 350 కోట్లు మాత్రమేనన్నారు. ఈ పథకంతో చేనేత కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులకు మేలు జరిగిందని గుర్తుచేశారు. కానీ గత కొన్ని నెలలుగా బతుకమ్మ చీరల ఆర్డర్ లేకపోవడంతో కార్మికులకు ఉపాధి కరువైందన్నారు కేటీఆర్. దీంతో ఇప్పటివరకూ 10 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్‌ నిలిపివేయాలన్న అనాలోచిత నిర్ణయంపై ఇప్పటికైనా పునరాలోచన చేయాలని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్.

First Published:  9 July 2024 11:03 AM IST
Next Story