వీళ్లే కదా.. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు
హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన శేషయ్యకు 75 సంవత్సరాలు. లివర్ సిరోసిస్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారు. కానీ, ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి మరీ ఓటేశారు.
ఓటంటే నేటి యువతకు లెక్క లేదు.. ముఖ్యంగా నగర యువత పోలింగ్ రోజును హాలీ డేలా భావించి టూర్లు ప్లాన్ చేసుకునే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కదల్లేని స్థితిలో ఉన్నా, అనారోగ్యం పట్టి పీడిస్తున్నా ఎలాగోలా వచ్చి ఓటేస్తున్న పలువురు వృద్ధులు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు ఊదుతున్నారు. ఓటు వేయడం మన విద్యుక్త ధర్మమని చాటిచెబుతున్నారు.
లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్నా ఓటేశారు
హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన శేషయ్యకు 75 సంవత్సరాలు. లివర్ సిరోసిస్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారు. కానీ, ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి మరీ ఓటేశారు. ఓటేయడం పౌరుడిగా మన బాధ్యత అని ఆయన చెప్పడం విశేషం. 1966 నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ తాను ఓటేయకుండా లేనని చెప్పి యూత్‌కు మంచి సందేశం ఇచ్చారు.
నడవలేని పరిస్థితుల్లో వీల్ చైర్‌లో వచ్చి..
డయాలసిస్ రోగులు, ఆస్తమాతో బాధపడుతున్నవారు, ఇలా చాలామంది వీల్ చైర్లలో వచ్చి ఓటేసిన దృశ్యాలు నగరంలో చాలా బూత్‌లలో కనిపించాయి. ముషీరాబాద్ గాంధీనగర్‌కు చెందిన సరస్వతి అనే ఆస్తమా పేషెంట్ ఇలాగే వచ్చి ఓటేశారు. పల్లెల్లో అయితే ఇలాంటి వారిని పార్టీలవారే దగ్గరుండి వాహనంలో తీసుకెళ్లి ఓటేయించి తీసుకొస్తారు. ఓటేయమని అడగడానికే రాని నగరంలో కూడా తమ వంతు బాధ్యతగా కుటుంబసభ్యుల సాయంతో వీల్‌చైర్లలో వచ్చి మరీ ఓటేస్తున్న ఈ వృద్ధులే ప్రజాస్వామ్యానికి నిజమైన ప్రాణవాయువులు.