Telugu Global
Telangana

గుజరాత్ పంచాయత్ రాజ్ ఎగ్జామ్.. ఏపీలో పేపర్ ప్రింటింగ్... హైదరాబాద్ లో లీక్, ఒడిశా వ్యక్తి కీలకం

ఈ ఎగ్జామ్ పేపర్ ను గుజరాత్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లలో ప్రింట్ చేయించింది. 11 గంటలకు పరీక్ష జరగాల్సి ఉండగా 2 గంటల‌ ముందుగా హైదరాబాద్ నుండి ఈ పేపర్ లీక్ అయ్యింది.

గుజరాత్ పంచాయత్ రాజ్ ఎగ్జామ్.. ఏపీలో పేపర్ ప్రింటింగ్... హైదరాబాద్ లో లీక్, ఒడిశా వ్యక్తి కీలకం
X

గుజరాత్ లో ఈరోజు ఉదయం 11 గంటలకు జరగాల్సిన పంచాయతీ జూనియర్ క్లర్క్ రిక్రూట్‌మెంట్ పరీక్ష వాయిదా పడింది. పేపర్ లీక్ కావడం తో అధికారులు పరీక్షను వాయిదా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ఆదివారం 16 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.అందులో హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నారు.

ఈ ఎగ్జామ్ పేపర్ ను గుజరాత్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లలో ప్రింట్ చేయించింది. 11 గంటలకు పరీక్ష జరగాల్సి ఉండగా 2 గంటల‌ ముందుగా హైదరాబాద్ నుండి ఈ పేపర్ లీక్ అయ్యింది. హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మేనేజర్ జీతూ సింగ్ అనే వ్యక్తి ఈ పేపర్ ను ఒడిశాలో ఉన్న తన బంధువు ప్రదీప్ సింగ్ కు పంపగా ప్రదీప్ సింగ్ ఆ పేపర్ ను గుజరాత్ లోని జాంనగర్ లో పలువురు వ్యక్తులకు పంపాడు. జాంనగర్ నుండి ఆ పేపర్ రాష్ట్రమంతా లీక్ అయ్యింది. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు పరీక్ష రద్దు చేశారు.

హైదరాబాద్ వచ్చిన గుజరాత్ ATS పోలీసులు జీతూ సింగ్ ను అరెస్టు చేశారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు కూడా ATS బృందాలు వెళ్ళాయి.

గుజరాత్ ATS పోలీసు సూపరింటెండెంట్ (SP) సునీల్ జోషి మాట్లాడుతూ, "గతంలో పేపర్ లీక్ చేసిన వ్యక్తులపై గుజరాత్ ATS నిరంతరం నిఘా ఉంచింది. దాంతో విషయం బైటపడింది. ప్రశ్నాపత్రాలతో 15 మంది నిందితులను వడోదరలో అరెస్టు చేశారు. ఇది చాలా వ్యవస్థీకృత అంతర్ రాష్ట్ర ముఠా పని. పరీక్షను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదుపరి విచారణ జరుగుతోంది." అన్నారు.

పరీక్షను వీలైనంత త్వరగా నిర్వహిస్తామని, తేదీని త్వరలో ప్రకటిస్తామని గుజరాత్ పంచాయతీ సర్వీస్ సెలక్షన్ బోర్డ్, గాంధీనగర్ తెలిపింది.

"అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా, 29-01-2023న ఉదయం 11-00 గంటలకు జరిగే పోటీ పరీక్షను వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది, దీనిని అభ్యర్థులందరూ గమనించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. అందు వల్ల అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లవద్దని సూచిస్తున్నాం. సదరు పరీక్ష త్వరలో మళ్లీ నిర్వహించబడుతుంది. దాని తేదీని త్వరలో ప్రకటిస్తాము. ”అని బోర్డు తెలిపింది.

పోలీసులకు అందిన సమాచారం మేరకు అనుమానితుడైన ఇసామ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతడి వద్ద‌ పరీక్ష ప్రశ్నపత్రం కాపీ లభించింది. ఒడిశా, హైదరాబాద్ లింకులు తెలిశాయి. తదుపరి విచారణ జరుగుతోంది.

పరీక్ష కోసం జామ్‌నగర్ కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు, వారి వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దాని బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఒక్క జామ్‌నగర్లోనే మొత్తం 26,882 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 7,00,000 మందికి పైగా పరీక్షకు హాజరుకానున్నారు.

First Published:  29 Jan 2023 3:46 PM IST
Next Story