Telugu Global
Telangana

చెక్కుచెదరని గిన్నిస్ రికార్డ్.. హైదరాబాద్ కుర్రాడి సొంతమైంది..

స్పానిష్ మూవీకంటే ఒకటీ అరా అవార్డులు ఎక్కువ తెచ్చుకోలేదు. ఏకంగా 513 అవార్డులు సొంతం చేసుకున్నాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని తిరగరాశాడు. హైదరాబాద్ సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు.

చెక్కుచెదరని గిన్నిస్ రికార్డ్.. హైదరాబాద్ కుర్రాడి సొంతమైంది..
X

ఒక సినిమాకి ఒకటీ రెండు అవార్డులు వస్తే అది గొప్ప విషయమే. అలాంటిది ఓ స్పానిష్ సినిమాకి ఏకంగా 384 అవార్డులొచ్చాయి. దీంతో ఆ సినిమా గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది. మూడేళ్లుగా ఆ రికార్డ్ చెక్కుచెదరకుండా ఉంది. ఇప్పుడు ఆ అరుదైన రికార్డ్ ని బద్దలు కొట్టాడు హైదరాబాద్ కుర్రాడు. గిన్నిస్ బుక్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. స్పానిష్ మూవీకంటే ఒకటీ అరా అవార్డులు ఎక్కువ తెచ్చుకోలేదు. ఏకంగా 513 అవార్డులు సొంతం చేసుకున్నాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని తిరగరాశాడు. హైదరాబాద్ సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు.

దీపక్ రెడ్డి ఏం సాధించారు..?

హైదరాబాద్ కి చెందిన యువ దర్శకుడు దీపక్ రెడ్డి రెండేళ్ల క్రితం మనసానమః అనే షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ఒక హీరో, ముగ్గురు హీరోయిన్లు.. ఓ అందమైన ప్రేమకథ ఇది. అయితే ఇందులో చాలా స్పెషాలిటీలున్నాయి. అమ్మాయిల చంచల మనస్తత్వాన్ని ప్రతిబింబించే ఈ ప్రేమ కథ నిడివి 15నిమిషాలే. ప్రతి ఫ్రేమ్ ఓ అద్భుతం అన్నట్టుగా దీన్ని చిత్రీకరించాడు దీపక్ రెడ్డి. కేవలం రివైండ్ షాట్స్ తో 5 నిమిషాల సన్నివేశాల్ని నడిపించాడు. అమ్మాయిల పేర్లను ప్రకృతికి ముడిపెడుతూ ఎక్కడా అశ్లీలత లేకుండా, మనసుకి హత్తుకునేలా తెరకెక్కించాడు. ఇప్పటి వరకు వివిధ సంస్థలు ఈ షార్ట్ ఫిల్మ్ కి 513 అవార్డులిచ్చాయి. గతంలో ఓ స్పానిష్ చిత్రానికి 384 అవార్డులు రావడం ప్రపంచ రికార్డ్ గా ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ ని 513 అవార్డులతో బ్రేక్ చేశాడు దీపక్ రెడ్డి. ఈ విజయాన్ని మంత్రి కేటీఆర్ ని కలసి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారాయన.

అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన హైదరాబాద్ కుర్రాడు దీపక్ రెడ్డికి సినిమాలంటే పిచ్చి. మనసానమః తోపాటు పలు షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. ఫిదా సినిమా అమెరికా షెడ్యూల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మకు దీపక్ వీరాభిమాని. ఆయన స్ఫూర్తితో వ‌ర్మ‌ ట్విట్టర్ అకౌంట్ ఆర్జీవీ జూమ్ ఇన్ లాగే, తన ట్విట్టర్ అకౌంట్ ని దీపక్ జూమ్ ఔట్ అని పెట్టుకున్నాడు. గతేడాది ఆస్కార్ అవార్డుల నామినేషన్‌ ను దక్కించుకొని అరుదైన ఘనత సాధించింది మనసానమః షార్ట్ ఫిల్మ్. ఆస్కార్ అవార్డు రాకపోయినా.. నామినేషన్ దక్కించుకోవడం ఎంతో గొప్ప అచీవ్‌మెంట్ అని చెప్పాలి. ఇప్పుడు ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తో హైదరాబాద్ సత్తాని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు దీపక్ రెడ్డి.

First Published:  18 Aug 2022 11:17 AM GMT
Next Story