Telugu Global
Telangana

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేతపై జీఎస్టీ రద్దు : రాహుల్ గాంధీ

కేంద్రంలో అధికారంలోకి వస్తే చేనేతపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేస్తాం. అలాగే దేశమంతా ఒకటే ట్యాక్స్ ఉంటుందని రాహుల్ చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేతపై జీఎస్టీ రద్దు : రాహుల్ గాంధీ
X

దేశంలో నిరుద్యోగం పెరగడానికి నోట్ల రద్దు, లోపభూయిష్టమైన జీఎస్టీనే కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. జీఎస్టీ కారణంగా చేనేత కార్మికులు, కుటుంబాల వ్యాపారానికి నష్టం, వారి వృత్తికి పెద్ద పడింది. నేను చేనేత కార్మికులను కలిసినప్పుడు ఆ విషయాన్ని వాళ్లు స్వయంగా చెప్పారు. 18 శాతం జీఎస్టీ వారిపై అమలు అవుతోంది. చిన్న వ్యాపారుల జీవనాన్ని జీఎస్టీ పూర్తిగా దెబ్బ తీసింది. దేశంలో జీఎస్టీ, నోట్ల రద్దు కేవలం ధనవంతులకు మేలు, లాభం చేయడానికే వచ్చిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మేం కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే చేనేతపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేస్తాం. అలాగే దేశమంతా ఒకటే ట్యాక్స్ ఉంటుందని రాహుల్ చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా మన్యంగుడి వద్ద ఆయన సభలో మాట్లాడారు.

ఆదివాసీలు, దళితులకు భూములపై పూర్తి హక్కు ఇస్తామని రాహల్ హామీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఎకరాలను దళితులకు పంచిందని.. కానీ సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ పెట్టి వాటిని ఆ వర్గాలకు దూరం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక దళితులకు పట్టాలిచ్చి పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. ఆదివాసీలకు కూడా భూమిపై పూర్తి హక్కు ఉంటుందని రాహుల్ చెప్పారు.

రైతు రుణమాఫీని చేయడానికి కాంగ్రెస్ తిరిగి నిర్ణయించిందని రాహుల్ చెప్పారు. నేను ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుస్తున్నాను. అనేక వర్గాల ప్రజలను కలుస్తున్నాను. వారు చెప్పే విషయాలను వింటున్నాను. అయితే రోజులో కేవలం పావు గంట మాత్రమే నేను మాట్లాడుతున్నాను. దేశంలో బీజేపీ పార్టీ హింస, ద్వేషాన్ని పెంచి పోషిస్తోంది. నేను ఈ భారత్ జోడో యాత్రను ప్రారంభించడానికి కారణం ఇదే. దేశంలో ద్వేషాన్ని, హింసను ప్రేరేపిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా.. మనుషులకు అండగా ఉండాలని నడుస్తున్నానని రాహుల్ అన్నారు.

యాత్రలో తనతో పాటు నడుస్తున్న అందరికీ ధన్యవాదాలన్నారు. ఎవరైనా కొంచెం దూరం నడిస్తే అలసిపోతారు. కానీ నాతో పాటు నడుస్తున్న వాళ్లు ఏడు గంటలు నడిచిన తర్వాత కూడా ఇప్పుడు ప్రారంభించినంత ఉత్సాహంగా ఉన్నారు. దీనికి కారణం మీరందరూ ఇచ్చే శక్తి, ఉత్సాహం కారణమని రాహుల్ చెప్పుకొచ్చారు.

First Published:  28 Oct 2022 7:40 PM IST
Next Story