Telugu Global
Telangana

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీలపై జీఎస్టీ అధికారుల దాడులు

కోమటిరెడ్డి కుటుంబానికి సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్, సుశీ అరుణాచల్ హైవేస్ లిమిటెడ్, సుశీ చంద్రగుప్త్ కోల్‌మైన్స్ లిమిటెడ్ అనే మూడు కంపెనీలు ఉన్నాయి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీలపై జీఎస్టీ అధికారుల దాడులు
X

హైదరాబాద్‌లోని సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ సంస్థ కార్యాలయాలపై తెలంగాణ జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇవ్వాళ ఉదయం 11 గంటలకే 25 బృందాలతో కూడిన 150 మంది అధికారులు, సిబ్బంది బంజారాహిల్స్‌లోని కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి ఈ సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. సుశీ ఇన్‌ఫ్రా కార్యాలయంతో పాటు సంస్థ డైరెక్టర్ల ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి.

మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఈ సంస్థ ఖాతాల నుంచి భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగాయని టీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. లావాదేవీలకు సంబంధించిన జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. ఆ జాబితాను పూర్తిగా పరిశీలించిన ఎలక్షన్ కమిషన్ ఆ లావాదేవీలన్నీ సుశీ ఇన్‌ఫ్రాకు చెందినవిగానే తేల్చింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతు ప్రసాద్ నేతృత్వంలో సోమవారం సోదాలు చేస్తున్నారు. ఈ సంస్థ పన్ను లావాదేవీల విషయంలో కూడా ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

కోమటిరెడ్డి కుటుంబానికి సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్, సుశీ అరుణాచల్ హైవేస్ లిమిటెడ్, సుశీ చంద్రగుప్త్ కోల్‌మైన్స్ లిమిటెడ్ అనే మూడు కంపెనీలు ఉన్నాయి. వీటి కార్యాలయాలన్నీ బంజారాహిల్స్‌లోనే ఉన్నాయి. ఈ మూడు కంపెనీలకు కలిపి తొమ్మిది మంది డైకెర్టర్లు ఉన్నారు. వీరిందరి ఇళ్లలో కూడా జీఎస్టీ అధికారులు దాడులు చేస్తున్నట్లు సమాచారం. సోమవారం పొద్దు పోయే సరికి దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అధికారులు పలు డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. జీఎస్టీ చెల్లింపుల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, మంగళవారం కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాగా, దాడులకు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారాన్ని అధికారులు తెలియజేయలేదు. పూర్తయిన తర్వాత పత్రికా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే దీనిపై కామెంట్ చేయడానికి డైరెక్టర్లు ఎవరూ అందుబాటులో లేరు.

First Published:  14 Nov 2022 5:50 PM IST
Next Story