Telugu Global
Telangana

గృహలక్ష్మికోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు..

4లక్షల ఇళ్లకు ఆర్థిక సాయం కోసం మొత్తం 15.04 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిలో 10.20లక్షల దరఖాస్తులు స్క్రూటినీ దాటాయి. అయినా కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది.

గృహలక్ష్మికోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు..
X

తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ మొదలవడంతో పండగ వాతావరణం నెలకొంది. మరోవైపు గృహలక్ష్మి పథకానికి కూడా దరఖాస్తులు స్వీకరణ పూర్తయింది. వీటికి తొలి దశ స్క్రూటినీ కూడా జరిగింది. మొత్తం 10.20 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చారు అధికారులు. వీటినుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది.

ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేసింది. అంటే తెలంగాణ మొత్తం 3.57 లక్షల ఇళ్లు కేటాయిస్తుంది. ముఖ్యమంత్రి పరిధిలో 43 వేల ఇళ్లు రిజర్వ్‌ చేశారు. మొత్తంగా 4 లక్షల ఇళ్లకు సంబంధించి గృహలక్ష్మి పథకం కింద ఒక్కొక్కరికి రూ.3లక్షలు ఆర్థిక సాయం అందజేస్తారు.

దరఖాస్తుల వెల్లువ..

4లక్షల ఇళ్లకు ఆర్థిక సాయం కోసం మొత్తం 15.04 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిలో 10.20లక్షల దరఖాస్తులు స్క్రూటినీ దాటాయి. అయినా కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తొలిదశలో గృహలక్ష్మి పథకం అందకపోయినా, అది నిరంతర ప్రక్రియ అని, ప్రజలు నిరాశపడొద్దని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో కూడా తొలిదశపైనే ప్రజలంతా ఆశలు పెట్టుకున్నారు. గృహలక్ష్మి ఆర్థిక సాయం కూడా తొలి దశలోనే అందాలని ఆశపడుతున్నారు. 10 లక్షలమందిలో ఆ 4 లక్షల మంది అదృష్టవంతులెవరో త్వరలోనే తెలుస్తుంది. పార్టీలకతీతంగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది.

First Published:  10 Sept 2023 11:44 AM IST
Next Story