Telugu Global
Telangana

వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు.. ప్రభుత్వంపై భారం ఎంతంటే.?

ప్రస్తుతం రాష్ట్రంలో కోటి 31 లక్షల 48 వేల డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో నెలకు 200 యూనిట్ల లోపు వాడేవి దాదాపు 1.05 కోట్లు వరకు ఉన్నాయి.

వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు.. ప్రభుత్వంపై భారం ఎంతంటే.?
X

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో హామీ అమలుకు కాంగ్రెస్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీలో రెండు స్కీములను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మిగతా స్కీముల అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. మొత్తం వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చింది.

వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పది లక్షలకు పెంపు హామీలు అమలు చేశామన్నారు. వంద రోజుల్లోగా మిగతా హామీలు అమలు చేస్తామన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కోటి 31 లక్షల 48 వేల డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో నెలకు 200 యూనిట్ల లోపు వాడేవి దాదాపు 1.05 కోట్లు వరకు ఉన్నాయి. ఈ కనెక్షన్ల నుంచి ప్రతి నెల కరెంటు బిల్లులపై విద్యుత్ పంపిణీ సంస్థలకు సుమారు రూ.350 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ 1.05 కోట్ల ఇళ్లకు కరెంటు ఉచితంగా ఇస్తే ఈ సొమ్మంతా డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక యూనిట్‌ కరెంటు సరఫరాకు (యావరేజ్‌ సప్లయ్‌ కాస్ట్‌) సగటున రూ.7.07 ఖర్చు అవుతోంది. అయితే 200 యూనిట్లు వినియోగించేవారికి ప్రస్తుతం సగటు వ్యయం కంటే తక్కువ ఛార్జీలే వసూలు చేస్తున్నారు. ప్రస్తుతమున్న వినియోగాన్ని బట్టి ఏడాదికి రూ.4,200 కోట్లు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. యావరేజ్‌ సప్లయ్‌ కాస్ట్ ప్రకారం చెల్లించాల్సి వస్తే ఇంకా ఎక్కువ నిధులు సమకూర్చాల్సి ఉంటుంది.

మరోవైపు ఉచిత కరెంటు పొందే 1.05 కోట్ల ఇళ్ల వినియోగదారుల వివరాల నమోదు కోసం ప్రత్యేక పోర్టల్‌ తీసుకురావాలని రేవంత్ సర్కార్‌ ప్లాన్ చేస్తోంది. ఈ పథకం పొందాలనుకునేవారు కరెంటు కనెక్షన్ల వివరాలన్ని పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు సైతం నేరుగా పోర్టల్​లో నమోదు చేసుకునే అవకాశాన్ని కర్ణాటకలో కల్పించారు. అక్కడి ప్రభుత్వం గత ఆగస్టు నుంచి ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ పథకం అమలు చేస్తోంది.

First Published:  23 Jan 2024 4:25 PM IST
Next Story