Telugu Global
Telangana

బీజేపీలో పెరుగుతున్న విభేదాలు.. 29న ఖమ్మం సభ వాయిదా?

పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు ఆయన ఈ నెల 29న హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తున్నది.

బీజేపీలో పెరుగుతున్న విభేదాలు.. 29న ఖమ్మం సభ వాయిదా?
X

తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య విభేదాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో పార్టీలో అసంతృప్తి ఉన్నా.. బయటకు వెల్లడించేవారు కాదు. కానీ, ఇటీవల కాలంలో రాష్ట్ర నాయకులు ఏకంగా మీడియా ముందే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. 'ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి. ఇకపైనా అధ్యక్షుడిని ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి' అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్న విభేదాలు బయటపడేశాయి. మరోవైపు సీనియర్ నాయకురాలు విజయశాంతి కూడా పార్టీపై తన అసహనాన్ని బయటపెట్టారు.

ఈ క్రమంలో మరోసారి బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టి పెట్టారు. పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు ఆయన ఈ నెల 29న హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి ఆ రోజు ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించాల్సి ఉన్నది. అయితే, ప్రస్తుతం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల కారణంగా అక్కడ సభను జరిపితే విజయవంతం అవుతుందో లేదో అనే అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ముందుగా పార్టీని చక్కదిద్దే పనిలో అమిత్ షా పడ్డారు.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలో ఉన్న అసంతృప్త, అసమ్మతి నాయకుల కారణంగా నష్టం ఏర్పడుతుందని అధిష్టానం భావిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల కోసం దూకుడుగా ముందుకు వెళ్తుండగా.. బీజేపీ మాత్రం పార్టీ అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడుతోంది. రాష్ట్రంలో బీజేపీ క్షేత్ర స్థాయిలో అంతగా బలంగా లేదు. కనీసం 119 నియోజకవర్గాలకు అభ్యర్థులు దొరికే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి విషయాలపై ఫోకస్ చేయాల్సిన రాష్ట్ర నాయకత్వం మాత్రం పదవుల కోసం కొట్లాడుకుంటోంది.

బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని భావించినా.. కర్ణాటక ఎన్నికల ప్రభావంతో పార్టీలో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి సమస్యలపై 29న హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో అమిత్ షా మార్గ నిర్దేశం చేస్తారని తెలుస్తున్నది. బలమైన అభ్యర్థులను వెతికేందుకు సీనియర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. సంస్థాగత అంశాలపైనే ఈ సమావేశంలో చర్చిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి.

విజయశాంతి వ్యవహారం కూడా అధిష్టానం వద్దకు వచ్చిందని.. ఆమెతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అవుతారని కూడా సమాచారం. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే అమిత్ షాకు తెలియజేసినట్లు తెలుస్తున్నది. సోమవారం ఢిల్లీలో అమిత్ షాను బండి సంజయ్ కలిశారు. ఇటీవల అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత పార్టీలో ఉన్న విభేదాలపై ఒక నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

ఇప్పటికైనా పార్టీ నాయకులు ఢిల్లీ వెళ్లి కంప్లైంట్లు ఇవ్వొద్దని వ్యాఖ్యానించిన బండి సంజయే.. ఇప్పుడు అధిష్టానానికి పలు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తున్నది. వాటిపై కూడా 29న జరుగనున్న సమావేవంలో చర్చించే అవకాశం ఉన్నది. రాజా సింగ్ విషయంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. కొంత మంది ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతుండగా.. మరి కొంత మంది దానిని విభేదిస్తున్నారు. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత వల్ల కలిగే లాభనష్టాలను కూడా సమావేశంలో చర్చిస్తారని సమాచారం.

రాష్ట్ర నాయకుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించడం, అసెంబ్లీ ఎన్నికలకు ఎలా సిద్ధపడాలనే విషయాలపైనే సమావేశంలో అమిత్ షా దృష్టి పెట్టనున్నారు. వాయిదా వేసిన ఖమ్మం సభకు కొత్త తేదీని కూడా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  25 July 2023 8:23 AM IST
Next Story