Telugu Global
Telangana

బీజేపీలో వర్గపోరు.. కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజే బట్టబయలు

పదవి కోల్పోయిన బండి సంజయ్ ని చూస్తుంటే తన కళ్ల వెంట నీళ్లొచ్చాయని అన్నారు రాజగోపాల్ రెడ్డి. అలాంటి వ్యక్తికి పదవి తీసేస్తారనుకోలేదని పరోక్షంగా ప్రస్తావించారు.

బీజేపీలో వర్గపోరు.. కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజే బట్టబయలు
X

కాంగ్రెస్ లో వర్గపోరు సాధారణ విషయమే. కానీ తెలంగాణ బీజేపీలో కూడా కొత్తగా వర్గాలు మొదలయ్యాయి. అసలైన బీజేపీ నేతలు, పక్క పార్టీనుంచి బీజేపీలోకి వచ్చినవారు.. అంటూ రెండు వర్గాలుగా నేతలు గ్రూపులు మొదలు పెట్టారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ఒకరోజు ముందే కిషన్ రెడ్డి ఈ విషయంలో నోరు జారారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో హడావిడి చేయడానికి వచ్చిన ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తాము పార్టీలు మారిన నాయకులం కాదన్నారు. పక్కనే ఉన్న రఘునందన్ రావు ఆయన మాటలకు చిన్నబుచ్చుకున్నారు. కిషన్ రెడ్డి టార్గెట్ ఎవరైనా.. బీజేపీలో ఎన్నాళ్లున్నా కూడా తనను పక్కపార్టీ నేతగానే చూస్తారనే విషయం రఘునందన్ కి బాగా తెలిసొచ్చింది.

అక్కడ సీన్ కట్ చేస్తే ఈరోజు కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సభలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కిషన్ రెడ్డి ని పట్టించుకోకుండా బండి సంజయ్ ని ఆకాశానికెత్తేశారు. పదవి కోల్పోయిన బండి సంజయ్ ని చూస్తుంటే తన కళ్ల వెంట నీళ్లొచ్చాయని అన్నారు రాజగోపాల్ రెడ్డి. ఓ దశలో కన్నీరు ఆపుకోలేక తాను బాత్రూమ్ లోకి వెళ్లిమరీ ఏడ్చానని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ తెలంగాణలో పార్టీని బలోపేతం చేశారన్నారు. అలాంటి వ్యక్తికి పదవి తీసేస్తారనుకోలేదని పరోక్షంగా ప్రస్తావించారు. అయితే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, అందరం కట్టుబడి ఉండాలన్నారు రాజగోపాల్ రెడ్డి.

రగిలిపోతున్న బండి..

మరోవైపు అధ్యక్ష పదవి మార్పుపై బండి రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవితోపాటు, తెలంగాణ అధ్యక్ష పదవి కూడా ఇచ్చింది అధిష్టానం. తనకు మాత్రం ఉన్న పదవి తీసేసి, మంత్రి పదవి విషయంలో అధిష్టానం మోసం చేసిందని ఫీలవుతున్నారట. కిషన్ రెడ్డికి స్వీట్ తినిపించి మరీ పార్టీ ఆఫీస్ లో సందడి చేసిన బండి.. సన్నిహితుల దగ్గర మాత్రం తన అవస్థ చెప్పుకుని బాధపడుతున్నారని సమాచారం.

First Published:  21 July 2023 10:37 AM GMT
Next Story