గ్రూప్-2 అభ్యర్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఏముందంటే..?
గత రాత్రి హాస్టల్ లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది. ఆమె గదిలో సూసైడ్ నోట్ దొరికింది. అయితే ఆ లేఖలో గ్రూప్-2 ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
తెలంగాణ ఎన్నికల కారణంగా గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో హైదరాబాద్ అశోక్ నగర్ హాస్టల్ లో ఉంటూ గ్రూప్-2 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిని, 23 ఏళ్ల ప్రవళిక ఆత్మహత్య కలకలం రేపింది. గ్రూప్-2 వాయిదా పడటం వల్లే మానసిక వ్యధతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ మిగతా అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఆమె మృతదేహాన్ని కదలనీయకుండా కొంతసేపు రోడ్డుపై బైఠాయించారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆమె డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
సూసైడ్ నోట్ లో ఏముందంటే..?
వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక డిగ్రీ తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆమె హైదరాబాద్ అశోక్ నగర్ కి వచ్చి హాస్టల్ లో ఉంటూ గ్రూప్-2కి దరఖాస్తు చేసి పరీక్షకోసం ప్రిపేర్ అవుతోంది. గత రాత్రి హాస్టల్ లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది. ఆమె గదిలో సూసైడ్ నోట్ దొరికింది. అయితే ఆ లేఖలో గ్రూప్-2 ప్రస్తావన లేకపోవడం గమనార్హం. తనను క్షమించాలని, తాను చాలా నష్టజాతకురాలినని ఆ సూసైడ్ నోట్ లో పేర్కొంది ప్రవళిక. తన వల్ల తల్లిదండ్రులు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారని, వారి కడుపున పుట్టడం తన అదృష్టమని లేఖలో రాసింది. వారికోసం తానేమీ చేయలేకపోతున్నట్టు, వారికి చాలా అన్యాయం చేస్తున్నట్టు పేర్కొంది ప్రవళిక. 'అమ్మా.. నాన్న జాగ్రత్త!' అంటూ లేఖ ముగించింది.
ఎన్నికల కారణంగా తెలంగాణలో గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా పడిన మాట వాస్తవమే. దీనివల్ల కొందరు అభ్యర్థులు ఆందోళనకు గురికాగా.. కొంతమంది మాత్రం ప్రిపరేషన్ కు మరింత సమయం కలిసొచ్చిందని పాజిటివ్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో గ్రూప్-2 అభ్యర్థిని ఆత్మహత్య సంచలనంగా మారింది.