Telugu Global
Telangana

లండన్ లో గ్రీన్ యాపిల్.. తెలంగాణకు జోష్

యూకే, ఖతర్ తర్వాత అత్యధికంగా ఐదు కేటగిరీల్లో తెలంగాణ అవార్డులు సాధించడం విశేషం. తెలంగాణ తరపున రాష్ట్ర పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ పురస్కారాలు అందుకున్నారు.

లండన్ లో గ్రీన్ యాపిల్.. తెలంగాణకు జోష్
X

ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఐదు అవార్డులు దక్కించుకున్న తెలంగాణ తరపున లండన్ లో గ్రీన్ యాపిల్ పురస్కారాలు అందుకున్నారు రాష్ట్ర పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్. లండన్ లోని సెయింట్ పాల్ క్యాథడ్రల్ లో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ తరపున ఐదు అవార్డులను అరవింద్ కుమార్ అందుకున్నారు. రాష్ట్రం తరపున ఈ పురస్కారాలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారాయన. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్లను మెన్షన్ చేస్తూ అరవింద్ కుమార్ ట్వీట్ వేశారు.


యూకే, ఖతర్ తర్వాత అత్యధికంగా ఐదు కేటగిరీల్లో తెలంగాణ రాష్ట్రం అవార్డులు సాధించడం విశేషం. తెలంగాణలోని ఐదు కట్టడాలు, ఐదు కేటగిరీల్లో ఈ అవార్డులను గెలుచుకున్నాయి. వారసత్వ కట్టడాల విభాగంలో మొజాంజాహీ మార్కెట్, కార్యాలయాల విభాగంలో తెలంగాణ స‌చివాల‌యం, వంతెనల విభాగంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సంస్థల విభాగంలో పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్, ఆలయాలు, ఆధ్యాత్మిక నిర్మాణాల విభాగంలో యాద‌గిరిగుట్ట దేవాల‌యానికి గ్రీన్ యాపిల్ అవార్డులు వ‌చ్చాయి.

గ్రీన్‌ యాపిల్‌ సంస్థ 2016 నుంచి అవార్డులను ప్రదానం చేస్తోంది. పర్యావరణహిత కార్యక్రమాలను ప్రోత్సాహించే విషయంలో విశాలమైన ప్రాంతాల్లో, పర్యావరణ అనుకూల వాతావరణంలో చేపట్టిన నిర్మాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. నివాస, కార్యాలయ భవనాలు, కోటలు, మ్యూజియంలు, వంతెనలు, ఆధ్యాత్మిక కట్టడాలను అవార్డులకోసం పరిగణిస్తారు.

హైదరాబాద్ నగరానికి 2021లో ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్.. లివింగ్‌, ఇన్‌ క్లూజన్‌ అవార్డులు రాగా.. వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డ్‌ 2022లో వచ్చింది. ఈ ఏడాది ఏకంగా ఐదు కట్టడాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు రావడం విశేషం.

First Published:  17 Jun 2023 6:54 PM IST
Next Story