Telugu Global
Telangana

కేంద్ర బడ్జెట్‌లో నిధుల కోసం కేంద్రానికి లేఖ రాసిన కేటీఆర్

హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు సహకరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు అభ్యర్థనలు చేసిందని కేంద్రానికి గుర్తు చేస్తూ, రాష్ట్రం ప్రతిపాదనలు పంపిన ప్రతిసారీ నిరాశే ఎదురవుతున్నదని అన్నారు కేటీఆర్.

కేంద్ర బడ్జెట్‌లో నిధుల కోసం కేంద్రానికి లేఖ రాసిన కేటీఆర్
X

తెలంగాణలోని వివిధ పట్టణాలు, నగరాల అభివృద్ధికి 2023-24 కేంద్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించాలని కోరుతూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం కేంద్రానికి లేఖ రాశారు.

హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు సహకరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు అభ్యర్థనలు చేసిందని కేంద్రానికి గుర్తు చేస్తూ, రాష్ట్రం ప్రతిపాదనలు పంపిన ప్రతిసారీ నిరాశే ఎదురవుతున్నదని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పట్టణాల్లో అభివృద్ధికి కట్టుబడి ఉంది. బిజెపి ప్రభుత్వం తెలంగాణకు అవసరమైన నిధులు కేటాయించి రాష్ట్రం పట్ల నిబద్ధతను నిరూపించుకోవాలని కేటీఆర్ తన లేఖలో కోరారు.

హైదరాబాద్, వరంగల్ తదితర పట్టణ స్థానిక సంస్థ(ULB)ల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు కేంద్రం తగినన్ని నిధులు మంజూరు చేయాలని, లేదంటే హైదరాబాద్, వరంగల్ నగరాలకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాలని కోరారు.

తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష కారణంగా రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా అదనంగా మంజూరు కాలేదు. కేంద్రం వివక్ష చూపిస్తున్నప్పటికీ తెలంగాణ ULB, ఇతర రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు.

తెలంగాణ తన ఆర్థిక ప్రణాళిక ద్వారా ముందుకు దూసుకుపోతోందని, వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి నిధులు అందజేస్తున్న రాష్ట్రాల్లో అగ్రగామిగా ఉందని, మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు కేంద్రం మరింత సహకారం అందించాలని మంత్రి కోరారు.

బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి ఆర్థిక బడ్జెట్ ఇదే కాబట్టి తెలంగాణకు తగినన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కోరారు.

''మెరుగైన పనితీరు కనబరిచే రాష్ట్రాలకు బిజెపి ప్రభుత్వం మరిన్ని నిధులు, ప్రోత్సాహకాలను మంజూరు చేయాలి. సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో తన నిబద్ధతను నిరూపించుకోవాలి" అని కేటీఆర్ అన్నారు.

వేగవంతమైన పట్టణీకరణను పరిగణనలోకి తీసుకుని, ఇప్పటికే తెలంగాణలో 47 శాతం మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి వివిధ అభివృద్ధి పనులను చేపడుతోంది. దీని కోసం, తెలంగాణ మునిసిపాలిటీల చట్టం, 2019 తీసుకొచ్చాం. అని కేటీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ప్లాన్ చేసి ప్రారంభించిన వివిధ పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా మంత్రి వివరించారు. వీటిలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (SRDP), స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (SNDP), కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ (CRMP), హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (HRDC), మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MRDC), తెలంగాణ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TUFIDC) ఉన్నాయి.

కేటీఆర్ డిమాండ్లు

• హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్ కోసం సూత్రప్రాయంగా ఆమోదం,రూ.6,250 కోట్లు సహాయం

• హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ ఏరియాలో మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కోసం రూ.450 కోట్లు (15 శాతం ఈక్విటీ) 20 కి.మీ కవర్ మరియు రూ.3,050 కోట్లు

• ఐదు సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న‌ మెట్రో రైల్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూ.254 కోట్లు.

• బయో మైనింగ్, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ ఇన్‌స్టాలేషన్ వంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్‌ల కోసం రూ.750 కోట్లు, రూ.3777 కోట్లతో చేపడుతున్న వ్యర్థ-నీటి శుద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం.

• SNDP కోసం రూ.240 కోట్లు

• 41 STPలు, 2,232 కి.మీ-మురుగునీటి నెట్‌వర్క్ కోసం రూ.8,684 కోట్లు మూడింట ఒక వంతు ఖర్చు

• హైదరాబాద్ కు స్వచ్ఛ భారత్ మిషన్ నిధుల కింద రూ.400 కోట్లు

• మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, ఈస్ట్ వెస్ట్ ఎక్స్‌ప్రెస్ వే (రూ.11,500 కోట్లు), SRDP II (రూ.14,000 కోట్లు), ఎలివేటెడ్ కారిడార్లు (రూ.9,000 కోట్లు) కోసం రూ.34,500 కోట్లలో పది శాతం కేటాయించాలి.

• 104 కారిడార్లలో లింక్ రోడ్ల నిర్మాణానికి రూ.800 కోట్లు

• జాతీయ రహదారి 65పై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ.500 కోట్లు

• తెలంగాణ శానిటేషన్ హబ్ కోసం రూ.100 కోట్ల సీడ్ ఫండింగ్

• మునిసిపల్ బాండ్ల యొక్క మూడవ విడతను పెంచడం కోసం GHMCకి ప్రోత్సాహకాలు

First Published:  9 Jan 2023 7:47 AM IST
Next Story