గ్రాడ్యుయేట్లకు ఓటెయ్యరాలే!
చెల్లని ఓట్లు 40 వేలకు పైనే

కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ గ్రాడ్యుయేట్ స్థానంలో చెల్లని ఓట్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆ ఓట్లను చూసి అభ్యర్థులు, ఎన్నికల అధికారులు, సిబ్బంది చదువుకున్నోళ్లకే ఓటేయరాకపోతే ఎలా అని పెదవి విరుస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు కరీంనగర్ లోని డాక్టర్ అంబేద్కర్ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఇప్పటి వరకు చెల్లని ఓట్ల గుర్తింపు దగ్గరే ఉంది. ఉదయాన్నే బ్యాలెట్ బాక్సుల సీల్ ఓపెన్ చేసి బ్యాలెట్ పేపర్లను డ్రమ్ముల్లో పోశారు. తర్వాత చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. చెల్లుబాటు అయ్యే ఓట్లను ప్రతి 50 ఓట్లకు ఒక బండిల్ చొప్పున కట్టలు కడుతున్నారు. అర్ధరాత్రి వరకు ఓట్లను కట్టలు కట్టే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది. 2.50 లక్షలకు పైగా గ్రాడ్యుయేట్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోగా ఇప్పటికే 40 వేలకు పైగా ఓట్లు చెల్లుబాటు కాలేదని సమాచారం. తమకు పోలైన ఓట్లను చెల్లుబాటు కానివిగా ప్రకటించడంతో కౌంటింగ్ సెంటర్ వద్ద పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కౌంటింగ్ కేంద్రం నుంచి అందుతున్న సమాచారం మేరకు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణలకు పోటాపోటీగా ఓట్లు నమోదవుతున్నాయని తెలిసింది.
బ్యాలెట్ పేపర్ పై ప్రిసైడింగ్ అధికారి ఇచ్చిన పెన్నుతోనే ఇంగ్లిష్ నంబర్లలో ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉండగా కొందరు ఓటర్లు తమ సొంత పెన్నులతో ఓటు వేశారని సమాచారం. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థి పేరు, ఫొటోకు ఎదురుగా ఉన్న గడిలో ఇంగ్లిష్ అక్షరాల్లో 1, 2, 3.. ఇలా ప్రాధాన్యత క్రమంలో నంబర్ వేయాలి.. కొందరు ఒకటికి ముందు సున్నా పెట్టడం, మరి కొందరు ఒకటి పెట్టి దానిని రౌండప్ చేయడం, ఒకటి పెట్టి టిక్ చేయడంతోనే ఆయా ఓట్లు చెల్లుబాటుకాకుండా పోయాయి. ఎన్నికల అధికారులు ఓటర్లకు సరైన విధానంలో ఓటు వేయడంపై అవగాహన కల్పించలేదని.. అందుకే రికార్డు స్థాయిలో ఓట్లు చెల్లుబాటు కాకుండా పోతున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.