గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్.. స్వల్ప ఆదిక్యంలో బీజేపీ అభ్యర్థి
కరీంనగర్ లో ముగిసిన మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు

కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో మొదటి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి స్వల్ప ఆదిక్యంలో ఉన్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు మొదలైన బ్యాలెట్ల విభజన ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం ముగిసింది. మొత్తం 21 టేబుళ్లపై ఒక్కో రౌండ్ కు 21 వేల ఓట్లను లెక్కిస్తున్నారు. ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,712 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 6,676 ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి 36 ఓట్ల ఆదిక్యం లభించింది. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,867 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు యాదగిరి శేఖర్ రావుకు 500, ముస్తాక్ అలీకి 156, సర్దార్ రవీందర్ సింగ్‌కు 107 ఓట్లు పోలయ్యాయి. ఈ స్థానంలో 3.55 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా 2,50,106 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 28 వేలకు పైగా ఓట్లు చెల్లనివని అధికారులు నిర్దారించారు. మొత్తం పదకొండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. చెల్లుబాటు అయ్యే 2.24 లక్షల ఓట్ల ఓట్లను లెక్కించిన తర్వాత కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఫలితం తేలే అవకాశం లేదనే అంచనాలో అన్ని పార్టీల అభ్యర్థులు ఉన్నారు. సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కించిన తర్వాతే విజేత ఎవరో తేలే అవకాశముంది.