Telugu Global
Telangana

ప్రజలపై రూ.18,500 కోట్ల అదనపు భారం మోపుతున్నరు

మాజీ మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌ రెడ్డి

ప్రజలపై రూ.18,500 కోట్ల అదనపు భారం మోపుతున్నరు
X

కరెంట్‌ చార్జీల పెంపుపైతో పాటు వివిధ పేర్లు చెప్పి రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం రూ.18,500 కోట్ల భారం మోపాలని చూస్తోందని మాజీ మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌ రెడ్డి తెలిపారు. కరెంట్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరుతూ సోమవారం ఈఆర్సీ చైర్మన్‌ శ్రీరాంగరావు, సభ్యులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఈఆర్సీ ఎదుట హాజరై వాదనలు వినిపించారు. ఒకేసారి ప్రజలపై ఇంత భారం మోపడం దారుణమన్నారు. ఇప్పటికే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వ్యవసాయం రంగం నుంచి మొదలుపెట్టి పారిశ్రామికరంగం వరకు అన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు. ఫిక్సుడ్‌ చార్జీల పేరుతో గృహ వినియోగదారులపై భారం పేపేందుకు రంగం చేశారని, పారిశ్రామికరంగానికి చెందిన అన్ని కేటగిరిలకు ఓకే రేటు నిర్ణయించే ప్రయత్నం చేస్తున్నారని, ట్రూ అప్‌ చార్జీల పేరుతో ప్రజలపై ఎక్కువ భారం మోపాలని కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఈఆర్సీకి విద్యుత్‌ పంపిణీ సంస్థలు చార్జీల పెంపు కోసం తొమ్మిది రకాల ప్రతిపాదనలు చేసిందని తెలిపారు. ట్రూ అప్‌ చార్జీల పేరుతో రూ.963 కోట్లు, ఏఆర్‌ఆర్‌ చార్జీల పేరుతో రూ.16,364 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరానికి చార్జీల పెంపు రూపంలో రూ.1,200 కోట్లు, 300 యూనిట్లకు మించి కరెంట్‌ ఉపయోగించుకునే వినియోగదారులకు కిలోవాట్‌ కు స్థిరచార్జీ రూ.10 ఉంటే.. దానిని రూ.50కి పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయని తెలిసిందన్నారు. దీంతో వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.




ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని, చార్జీల పెంపుతో ఆయా రంగాలు మరిన్ని సమస్యల్లో కూరుకుపోతాయని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు డిస్కంలు ఈఆర్సీకి అనేక పర్యాయాలు చార్జీల పెంపు ప్రతిపాదనలు తెచ్చినా కేసీఆర్‌ అందుకు అంగీకారం తెలుపలేదని గుర్తు చేశారు. పేదలపై భారం వేయడానికి కేసీఆర్‌ ఒప్పుకోలేదని తెలిపారు. విద్యుత్‌ సంస్థలు నష్టాల్లో కూరుకుపోకుండా చార్జీల పెంపు భారం అప్పుడు ప్రభుత్వమే భరించిందని, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చార్జీల భారం మోసం ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలకు 24 గంటలు కరెంట్‌ చేశామని.. తద్వారానే పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందన్నారు. వ్యవసాయ, పారిశ్రామికరంగాలు పదేళ్లలో అద్భుత ప్రగతి సాధించడంలో 24 గంటల కరెంట్‌ దోహద పడటంతో పాటు ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చార్జీలను పెంచి కరెంట్‌ ను వ్యాపార వస్తువుగా మార్చేస్తుందన్నారు. తద్వారా తలెత్తే దుష్ప్రభాలను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. కరెంట్‌ చార్జీల పెంపుతో ఎంఎస్‌ఎంఈలు తీవ్రంగా నష్టపోతాయని, రాష్ట్ర ప్రగతికి ఈ నిర్ణయం గొడ్డలిపెట్టు అవుతుందన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా చార్జీలు పెంచకుండా ఈఆర్సీ నియంత్రణ చేయాలని విజ్ఞప్తి చేశారు.

First Published:  21 Oct 2024 3:01 PM IST
Next Story