పింఛన్లు పెంచడానికి పైసలు లెవ్వు.. మూసీకి రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడివి
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
ఆసరా పింఛన్లు పింఛన్లు పెంచడానికి, మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వడానికి, రుణమాఫీకి, రైతు భరోసాకు పైసలు లెవ్వు కానీ మూసీకి రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో హరీశ్ రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ పునరుజ్జీవం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదన్న సంగతి గుర్తించాలన్నారు. ప్రజలు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, అద్దె చెల్లించక గురుకులాలకు తాళాలు వేస్తున్నారని గుర్తు చేశారు. రెడ్ హిల్స్ లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు రెంట్ కట్టకపోవడంతో ఓనర్ కరెంట్ చేసి, తాళం వేశాడని తెలిపారు. ప్రభుత్వ ఆఫీసుల భవనాలకు అద్దె కట్టడానికే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనప్పుడు మూసీ పునరుజ్జీవానికి లక్షన్నర కోట్లు ఖర్చు చేయడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఈ పేరుతో దందా చేసి ఢిల్లీకి డబ్బు మూటలు పంపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు.