Telugu Global
Telangana

తెలంగాణ ప్రభుత్వంపై పరాయి రాష్ట్రంలో మళ్లీ విరుచుకపడిన గవర్నర్ తమిళిసై

నేను తెలంగాణకు గవర్నర్‌ను కాదు.. అక్కను అని తమిళిసై చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వంపై పరాయి రాష్ట్రంలో మళ్లీ విరుచుకపడిన గవర్నర్ తమిళిసై
X

గవర్నర్ తమిళిసై మరోసారి తెలంగాణ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తన పట్ల ఎలా వ్యవహరిస్తోందో వేరే రాష్ట్రంలో జరిగిన కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై మధ్య చాన్నాళ్లుగా గ్యాప్ ఉంటూ వచ్చింది. తెలంగాణ కేబినెట్ పంపే తీర్మానాలు, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తరచూ వెనక్కు పంపుతూ తమిళిసై ఇబ్బందిపెట్టారు. దీనిపై సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల నూతన సచివాలయంలో దేవాలయం, చర్చి, మసీదు ప్రారంభం సందర్భంగా అంతా సర్దుకుపోయినట్లే కనిపించారు. ఆ తర్వాత తెలంగాణ కేబినెట్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ పంపిన ఫైలును వెనక్కి పంపారు. అప్పటి నుంచి మళ్లీ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య గ్యాప్ పెరిగింది.


తాజాగా ఈ విషయాలపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఏబీపీ నెట్‌వర్క్ చెన్నైలో నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో రాజకీయాల్లో మహిళల పాత్రపై గవర్నర్ తమిళిసై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మేము పాత గవర్నర్లలాగ పని చేయడం లేదన్నారు. ఇప్పుడు ఉన్న గవర్నర్లు అందరూ చాలా యాక్టీవ్‌గా ఉన్నారు. మేం కొన్ని బిల్లులను రిజెక్ట్ చేసినా అవన్నీ రాజ్యాంగం ప్రకారమే చేస్తున్నామన్నారు. బిల్లులు ఎందుకు వెనక్కి పంపుతున్నానో నోట్ కూడా రాస్తున్నాను. కానీ ఇది రాజకీయ కక్షగా వాళ్లు చూస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు గవర్నర్లను చాలా అవమానిస్తున్నాయి. ఇలాంటి అవమానాలను తట్టుకొని మేం పని చేయాల్సి వస్తోందన్నారు. తెలంగాణలో ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయమన్నారు. కానీ వాళ్లు ఎలాంటి సేవలు చేశారని అడిగాను. వాళ్లు రాజకీయ నాయకులుగా ఉన్నారుగా అని ప్రశ్నిస్తే నన్ను అవమానించారని విమర్శించారు.

గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబంధాలు ఉండాలి. వారిద్దరూ కలిసి పని చేయాలి. కానీ చాలా రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణలో ఇలాంటి పరిస్థితి లేదని తమిళిసై చెప్పుకొచ్చారు. తెలంగాణ ఇప్పుడు ఎన్నికలకు వెళ్లబోతోంది. అందుకే నేను అన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేను. దాదాపు మూడు ఏళ్లు నేను తెలంగాణ సీఎంను కలవలేదు. ఇటీవలే ఒక కార్యక్రమంలో కలిసే అవకాశం కలిగిందని అన్నారు.

తెలంగాణలోని చాలా మంది గవర్నర్‌గా ఉన్న నన్ను విమర్శిస్తున్నారు. రాజ్‌భవన్‌లో రాజకీయం చేస్తున్నానని అంటున్నారు. కానీ సీఎంలు కూడా తమ స్నేహ హస్తాన్ని అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. నేను వివాదాలు కోరుకునే వ్యక్తిని కాదు. నా సొంత రాష్ట్రమైన తమిళనాడులో నన్ను అక్కా అని పిలుస్తారు. తెలంగాణలో కూడా చాలా మంది అక్కా అనే నన్ను సంబోధిస్తారు. నేను తెలంగాణకు గవర్నర్‌ను కాదు.. అక్కను అని తమిళిసై చెప్పారు. నేను ఒక రబ్బర్ స్టాంప్‌ గవర్నర్‌గా ఉండలేనని గవర్నర్ తమిళిసై అన్నారు.


First Published:  12 Oct 2023 4:51 PM IST
Next Story