Telugu Global
Telangana

గవర్నర్ తమిళిసై మరో తిరకాసు.. వాళ్లిద్దరినీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడం కుదరదు!

ఫైలును ఇన్నాళ్లు తన వద్దే ఉంచుకున్న గవర్నర్ తమిళిసై.. తాజాగా వారి అర్హతలపై కొర్రీలు పెట్టి.. మంత్రి మండలి నిర్ణయాన్ని తిరస్కరించారు.

గవర్నర్ తమిళిసై మరో తిరకాసు.. వాళ్లిద్దరినీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడం కుదరదు!
X

గవర్నర్ తమిళిసై మరోసారి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో విభేదించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోకి కేబినెట్ సిఫార్సు చేసిన ఇద్దరు వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడంపై తిరకాసు పెట్టారు. కొన్ని వారాల క్రితం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను సర్వీస్ కేటగిరీలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని మంత్రి మండలి సిఫార్సు చేసింది. దీనికి సంబంధించిన ఫైలును ఇన్నాళ్లు తన వద్దే ఉంచుకున్న గవర్నర్ తమిళిసై.. తాజాగా వారి అర్హతలపై కొర్రీలు పెట్టి.. మంత్రి మండలి నిర్ణయాన్ని తిరస్కరించారు.

ఆర్టికల్ 171(5) ప్రకారం వీరిద్దరికీ తగిన అర్హత లేదని.. వీరిని ఎమ్మెల్సీలుగా సంబంధిత రంగం నుంచి నామినేట్ చేయడానికి తన వద్దకు కావల్సిన సమాచారం రాలేదని తెలిపారు. కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ ఇద్దరూ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారని.. వీరిని సేవల రంగం నుంచి ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయలేనని ప్రభుత్వానికి పంపిన నోట్‌లో తెలియజేశారు.

కుర్రా సత్యనారాయణ సామాజిక సేవలో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొన్నారు. దాసోజు శ్రవణ్ ఏ రంగంలో ఎలాంటి విజయాలు సాధించారనేందుకు సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించలేదని గవర్నర్ తెలిపారు. కాగా, సహకార ఉద్యమం, సామిత్యం, కళలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రావీణ్యం ఉన్న అర్హత కలిగిన వ్యక్తులను కేబినెట్ సిఫార్సు చేస్తే తాను తప్పకుండా నియమిస్తానని ప్రభుత్వానికి గవర్నర్ స్పష్టం చేశారు.

మండిపడ్డ మంత్రి ప్రశాంత్ రెడ్డి..

దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. తమిళిసై గవర్నర్‌గా ఎలా అర్హత సాధించారని ప్రశ్నించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై నేరుగా గవర్నర్ కాలేదా అని విమర్శించారు. సామాజిక సేవను కూడా రాజకీయాల్లో భాగంగా చూడాలని.. అవి రెండూ వేర్వేరు కాదని చెప్పారు. సర్కారియా కమిషన్ సిఫార్సుల ప్రకారం గవర్నర్ పదవికి తమిళిసై పూర్తిగా అనర్హులని చెప్పారు. ఈ పదవులకు దాసోజు, కుర్రా తప్పకుండా అర్హులే అని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

First Published:  25 Sept 2023 3:46 PM IST
Next Story