'బండి' వ్యవహారం: మేయర్ బృందానికి అపాయింట్ మెంట్ ఇవ్వని గవర్నర్...రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత
బండిసంజయ్ పై పిర్యాదు చేసేందుకు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి తో సహా బీఆరెస్ కార్పోరేటర్లందరూ గవర్నర్ అపాయ్ంట్ మెంట్ కోరారు. ఈ రోజు ఉదయం అపాయింట్ మెంట్ కోరగా సాయంత్రానికి కూడా గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా బీఆరెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్ లో నిరసనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.
మరో వైపు, బండిసంజయ్ పై పిర్యాదు చేసేందుకు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి తో సహా బీఆరెస్ కార్పోరేటర్లందరూ గవర్నర్ అపాయ్ంట్ మెంట్ కోరారు. ఈ రోజు ఉదయం అపాయింట్ మెంట్ కోరగా సాయంత్రానికి కూడా గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. పావుగంటకు ఒకసారి రాజ్ భవన్ కు ఫోన్ చేసినప్పటికీ గవర్నర్ వైపు నుండి ఎలాంటి స్పందన రాలేదని ఆరోపిస్తూ మేయర్ తో సహా పెద్దఎత్తున కార్పోరేటర్లు, అనేక మంది మహిళా నేతలు రాజ్ భవన్ కు చేరుకున్నారు.
అయితే అపాయింట్ మెంట్ లేదని రాజ్ భవన్ సిబ్బంది వారిని గేటు బైటే ఆపేశారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దాంతో మేయర్ తో సహా బీఆరెస్ నేతలంతా రోడ్డుపైనే బైటాయించారు. దాంతో రాజ్ భవన్ రోడ్డులో ట్రాఫిక్ జాం అయ్యింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మేయర్ తో సహా, బీఆరెస్ నేతలందరినీ అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంలో మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, షర్మిల లాంటి వాళ్ళకు అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చిన గవర్నర్, మేయర్ అడిగితే అపాయింట్ మెంట్ ఇవ్వరా? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత మీద బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పిర్యాదు చేసేందుకు మాత్రమే వచ్చామని, పిర్యాదు లేఖ ఇచ్చి వెళ్ళిపోతామని మేయర్ చెప్పారు. ఒక మహిళను అవమానించిన సంఘటన గవర్నర్ పట్టించుకోరా? అని మేయర్ ప్రశ్నించారు.
కాగా, గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో అందుకు నిరసనగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే గొంగిడి సునీతతో సహా బీఆరెస్ మహిళా నేతలు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.