Telugu Global
Telangana

తెలంగాణలో రోడ్డు కం రైలు వంతెనకు ప్రభుత్వ ప్రతిపాదన.. ఎక్కడ నిర్మిస్తారో తెలుసా?

మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఈ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకొని వెళ్లారు. దీనికి కేసీఆర్ అంగీకారం తెలియజేయడంతో.. సదరు ప్రతిపాదనను రైల్వే అధికారులకు తెలియజేశారు.

తెలంగాణలో రోడ్డు కం రైలు వంతెనకు ప్రభుత్వ ప్రతిపాదన.. ఎక్కడ నిర్మిస్తారో తెలుసా?
X

రోడ్డు కం రైలు వంతెన అనగానే అందరికీ ఏపీలోని రాజమండ్రి దగ్గర గోదావరిపై నిర్మించిన బ్రిడ్జినే గుర్తుకు వస్తుంది. ఆ బ్రిడ్జిపై రైలులో ప్రయాణించగం అందరికీ ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి రోడ్ కం రైలు బ్రిడ్జి రాబోతున్నది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదనను రైల్వే శాఖ దృష్టికి తీసుకొని వెళ్లింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు కొత్త రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. మనోహరాబాద్ నుంచి కొత్త పల్లి వరకు నిర్మించే ఈ కొత్త రైలు మార్గంలో ఒక రోడ్ కం రైలు వంతెనకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది.

మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ మార్గంలో మిడ్ మానేరుపై వేములవాడ సమీపంలో ఈ రోడ్ కం రైలు మార్గం వచ్చేలా ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే ట్రాక్ పూర్తయ్యింది. అప్పుడప్పుడు గూడ్స్ రైళ్లు కూడా నడుస్తూనే ఉన్నాయి. ఇక సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా కొత్తపల్లి వరకు నిర్మించబోయే రైలు మార్గం కోసం భూసేకరణ చేపట్టాల్సి ఉన్నది. తొలుత ఇక్కడ కేవలం రైలు వంతెన మాత్రమే నిర్మించాలని భావించారు. కానీ, ఇటీవల జరిగిన సన్నాహక చర్చలో.. మిడ్ మానేరుపై రోడ్ కం రైలు వంతెన కూడా ఉంటే బాగుంటుందని నిర్ణయించారు.

మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఈ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకొని వెళ్లారు. దీనికి కేసీఆర్ అంగీకారం తెలియజేయడంతో.. సదరు ప్రతిపాదనను రైల్వే అధికారులకు తెలియజేశారు. దాదాపు కిలోమీటర్ పొడవైన రోడ్డు రైలు వంతెన తంగెళ్లపల్లి మండలంలో ప్రారంభమై వేములవాడలో ముగిసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

కొత్తపల్లి-మనోహరాబాద్ రైలు మార్గాన్ని రైల్వే శాఖ అత్యంత కీలకంగా భావిస్తోంది. 151.36 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గం కోసం రూ.1,981.64 కోట్ల వ్యయం అవుతుందదని అంచనా వేసింది. ఇందులో మూడింట ఒక వంతు నిధులను రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వనున్నది. భూసేకరణ, మౌలిక సౌకర్యాల బాధ్యతలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈ రైలు మార్గం నిర్మించిన తర్వాత నష్టాలు వస్తే.. తొలి ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని భరించేలా ఒప్పందం చేసుకున్నారు.

కీలకమైన ఈ రైలు మార్గంలో 13 స్టేషన్లు ఉండనున్నాయి. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్‌లను మార్గంతో కలుపుతారు. ఈ మార్గంలో 21 భారీ బ్రిడ్జిలు, 159 మైనర్ బ్రిడ్జిలు, 7 ఆర్వోబీలు, 49 ఆర్‌యూబీల రానున్నాయి. 2025కల్లా ఈ ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకున్నాయి.

First Published:  18 Sept 2023 7:59 AM IST
Next Story