పేరు మార్చగలరు.. యాదాద్రిలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని కాదనగలరా?
లక్ష్మీనరసింహ స్వామి కొలువై ఉన్న ప్రసిద్ధ క్షేత్రం యాదాద్రి కాదని.. దాన్ని పాత పేరు యాదగిరిగుట్టగా మార్చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నిన్న ప్రకటించారు.
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అనంతరం దానికి యాదాద్రి అని పేరు మార్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుదాన్ని మళ్లీ యాదగిరిగుట్టగా పేరు మారుస్తామంటోంది. పేరయితే మార్చగలరేమో కానీ యాదాద్రిలో బీఆర్ఎస్ చేసిన అద్భుతమైన అభివృద్ధిని కాదనగలరా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
యాదాద్రి కాదు.. యాదగిరిగుట్టేనట!
లక్ష్మీనరసింహ స్వామి కొలువై ఉన్న ప్రసిద్ధ క్షేత్రం యాదాద్రి కాదని.. దాన్ని పాత పేరు యాదగిరిగుట్టగా మార్చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నిన్న ప్రకటించారు. పూర్వం నుంచి ఉన్న పేరు మార్చడం సరికాదని వ్యాఖ్యానించారు. శుక్రవారం స్వామి సన్నిధిలోనే ఆయన ఈ ప్రకటన చేశారు.
అభివృద్ధి పనులపై జనం దృష్టి మరల్చలేకేనా?
2014లో తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట అభివృద్ధికి కంకణం కట్టుకుంది. 100 కోట్లతో గుట్ట అభివృద్ధి అని ప్రకటించిన కేసీఆర్ తర్వాత దానికి మూడు నాలుగు రెట్లు ఎక్కువే ఖర్చుపెట్టి గుట్టను నభూతో అన్న స్థాయిలో అభివృద్ధి చేశారు. కొండమీద చిన్న గుడిలా ఉన్న ఆలయాన్ని ఏళ్ల తరబడి శ్రమించి, తెలంగాణ తిరుపతి అనే స్థాయిలో అభివృద్ధి చేశారు. కొండమీదే కాటేజ్‌లు,అతిథిగృహాలు నిర్మించారు. దానికి యాదాద్రి అనే పేరయితే బాగుంటుందని పండితులు, పెద్దలు చెప్పడంతో ఆమేరకు పేరు మార్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ యాదగిరిగుట్ట అని పేరు మార్చినంత మాత్రాన ఆలయాభివృద్ధికి బీఆర్ఎస్ చేసిన కృషిని మరుగుపరచగలమని అనుకోవడం మూర్ఖత్వమేనని బీఆర్ఎస్ శ్రేణులే కాదు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.