Telugu Global
Telangana

వృద్ధులను ఆదరించకపోతే ఆస్తులు వాపస్.. - తెలంగాణలో చట్ట సవరణకు ప్రశంసలు

సమస్య ఏర్పడితే దాని పరిష్కారానికి నిర్ణీత గడువును కూడా విధిస్తోంది. ఆస్తుల బదలాయింపు అంశాన్ని పరిష్కరించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.

వృద్ధులను ఆదరించకపోతే ఆస్తులు వాపస్.. - తెలంగాణలో చట్ట సవరణకు ప్రశంసలు
X

మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో మనిషికి వృద్ధాప్యం అన్నది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. తాము వృద్ధులమైతే ఎలా జీవిస్తామో అని వయసులో ఉన్న వారు కూడా ఆందోళన చెందే పరిస్థితులు సమాజంలో ఏర్పడుతున్నాయి. భారీగా ఆస్తులు సంపాదించి ఇచ్చినా, కష్టపడి ఉన్నత చదువులు చదివించినా తమ పిల్లలు తమను ఆదరిస్తారో.. లేదో అన్న భయం చాలామందిలో ఉంది.

కొందరు వారసులు పెద్దల పేరున ఉన్న ఆస్తులన్నింటిని తమ పేరున మార్చుకున్న తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తున్న ఉదంతాలు అనేకం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్ట సవరణ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. వృద్ధులకు భరోసా కల్పించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ చట్టం - 2011 లో కీలక మార్పులు చేసింది.

తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ సవరణ ప్రకారం వృద్ధ తల్లిదండ్రులను విస్మరిస్తే వారు సంపాదించిన ఆస్తులు తిరిగి వాపస్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు కేవలం గిఫ్టుగా ఇచ్చిన ఆస్తులను మాత్రమే ఇలా వెనక్కు తీసుకునే అవకాశం ఉండేది. ఇకపై రిజిస్ట్రేషన్ చేసిన తరువాత కూడా తమను సరిగా ఆదరించని వారసుల నుంచి ఆస్తులు వెనక్కు తీసుకోవచ్చు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది.

సమస్య ఏర్పడితే దాని పరిష్కారానికి నిర్ణీత గడువును కూడా విధిస్తోంది. ఆస్తుల బదలాయింపు అంశాన్ని పరిష్కరించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఇప్పటివరకు ఆస్తులను తిరిగి తల్లిదండ్రుల పేరున బదలాయించాలంటే అనేక కారణాలు అడిగేవారు. ఇకపై కేవలం తమ పిల్లలు తమను సరిగా చూసుకోవడం లేదని వివరిస్తే సరిపోతుంది. తమ జీవన భృతిని పెంచేలా చూడాలని తల్లిదండ్రులు, వృద్ధులు కోరేందుకు కూడా ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది. ఇదివరకు మెయింటెనెన్స్, ఆస్తుల బదలాయింపు అధికారాలను పోలీసులకు చట్టం అప్పగించింది. ఇప్పుడు ఆ అధికారాలను ఆర్డీవో, కలెక్టర్ లకు అప్పగించారు. ఇప్పటివరకు వృద్ధులు దాఖలు చేసిన ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత కాలపరిమితి లేదు. అయితే చట్ట సవరణ ద్వారా 90 రోజుల్లో ఇకపై సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే ఆ గడువును మరో 30 రోజులు పొడిగించుకోవచ్చు.

ఆస్తుల బదలాయింపు కోసం వచ్చే ఫిర్యాదులపై కలెక్టర్ 15 రోజుల్లోనే స్పందించాల్సి ఉంటుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రెండు నెలల్లో తన నివేదికను కలెక్టర్ కు అందజేస్తారు. 2019లోని వయోవృద్ధుల కోసం దేశంలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం 14567 నంబ‌ర్‌తో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్ లైన్ కి వచ్చిన కాల్స్ విశ్లేషించగా 46 శాతం మంది వృద్ధ మహిళలు, 54 శాతం మంది వృద్ధపురుషులు వేధింపులకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వృద్ధులను వేధింపులకు గురి చేస్తున్న వారిలో 56 శాతం మంది కొడుకులు, 13 శాతం మంది కోడళ్ళు, ఏడు శాతం మంది కూతుళ్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

First Published:  12 Jan 2023 8:48 AM IST
Next Story