బతుకమ్మ పండుగ పూట జీతాలివ్వని సర్కార్
ఒక్కో హెల్త్ డిపార్ట్ మెంట్ లోనే 50 వేల మంది ఎదురుచూపులు
తెలంగాణలో ప్రతి ఇంట వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఇంకో ఐదు రోజుల్లో సద్దుల బతుకమ్మ పండుగ ఉంది. అయినా తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇంతవరకు ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు. నేషనల్ రూరల్, అర్బన్ హెల్త్ మిషన్ లలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తున్నా.. ఉద్యోగులు మాత్రం జీతాల కోసం ఎదురు చూడక తప్పడం లేదు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో తమకు త్వరగా వేతనాలు ఇవ్వాలని నేషనల్ హెల్త్ మిషన్ లో పని చేస్తున్న ఉద్యోగులు శనివారం స్కీం డైరెక్టర్ ను వేడుకున్నారు. ఎన్‌హెచ్‌ఎంలో పని చేస్తున్న ఉద్యోగలకు సెప్టెంబర్ నెల జీతాలతో పాటు ఏడు నెలల పీఆర్సీ బకాయిలను పండుగ పూట రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 9వ తేదీలోగా జీతాలు, పీఆర్సీ బకాయిలు ఇవ్వకపోతే 10వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని తేల్చిచెప్పారు. మిగతా ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదు. పండుగ పూట కూడా జీతాలివ్వకుండా ప్రభుత్వం తమను వేధింపులకు గురి చేస్తోందని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.