ప్రభుత్వం ప్రజలను వేధిస్తోంది
అర్థం పర్థం లేని పనులతో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
హైడ్రా పేరుతో ప్రజలను ప్రభుత్వం వేధిస్తోందని, సూర్యాపేటలో కూల్చివేతలకు కుట్ర చేస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పాములా బుసలు కొట్టి విధ్వంసం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థం పర్థం లేని పనులతో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోందని, ఇంతటి బాధ్యతా రాహితమైన ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. సూర్యాపేట పట్టణంలోనే కూల్చివేతల పేరుతో రూ.వెయ్యి కోట్ల నష్టం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. తమ ఇండ్లు కూల్చేస్తారని సూర్యాపేటలో ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలకు శనివారం ఆయన సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. నీటి వనరుల సంరక్షణ పేరుతో ఏళ్ల తరబడి ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని రోడ్డున పడేస్తామంటే ఎట్లా అని ప్రశ్నించారు. పేదలపై ప్రభుత్వ దమనకాండను సాగనివ్వబోమన్నారు. ప్రాణం పోయినా ప్రభుత్వ దుర్మార్గాన్ని అడ్డుకొని తీరుతామన్నారు. ప్రభుత్వం తప్పు చేసి శిక్ష ప్రజలు వేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పనికి మాలిన పనులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల పై శాస్త్రీయంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.