Telugu Global
Telangana

ఇబ్రహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటనపై ప్రభుత్వం సీరియస్... 13 మందిపై కఠిన చర్యలు

ఇబ్రాహింపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన సంఘటనపై ప్రభుత్వం 13 మందిపై చర్యలు తీసుకుంది. ఆపరేషన్ చేసిన డాక్టర్‌ జోయల్‌ సునీల్‌ కుమార్‌పై క్రిమినల్‌ కేసు నమోదుచేసింది.

ఇబ్రహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటనపై ప్రభుత్వం సీరియస్... 13 మందిపై కఠిన చర్యలు
X

రంగారెడ్డి జిల్లా ఇబ్రాహింపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆగస్టు 25న 34 మంది మహిళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు (డీపీఎల్‌ క్యాంప్‌) చేయగా శస్త్రచికిత్స వికటించి నలుగురు మహిళలు మృతిచెందారు. 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించింది. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు మేరకు 13 మందిపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది.

రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్‌ ఝాన్సీ లక్ష్మిపై బదిలీ వేటువేయగా, ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ జోయల్‌ సునీల్‌ కుమార్‌పై క్రిమినల్‌ కేసు నమోదుచేసింది.

ప్రభుత్వం చర్యలు తీసుకున్నమిగతా వారిలో ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో పనిచేసే డీపీఎల్‌ క్యాంపు ఆఫీసర్ డాక్టర్ నాగజ్యోతి, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ గీత, హెడ్ నర్స్ చంద్రకళ మాడుగుల పీహెచ్‌సీ డాక్టర్ శ్రీనివాస్, సూపర్‌వైజర్లు అలివేలు, మంగమ్మ, మంచాల పీహెచ్‌సీ డాక్టర్ కిరణ్, సూపర్‌వైజర్ జయలత, దండుమైలారం పీహెచ్‌సీ డాక్టర్ పూనం, సూపర్‌వైజర్ జానకమ్మ ఉన్నారు.


ఇప్పటికే సస్పెండ్ అయిన ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్‌పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

First Published:  24 Sept 2022 10:22 AM IST
Next Story