ఒకటో తారీఖునే జీతం.. రేవంత్ చెప్పింది అబద్ధమేనా..?
ఆశావర్కర్లు, అంగన్‌వాడీల వర్కర్లకు ఇంకా జీతాలు అందలేదు. ఇప్పటికీ జీతాలు రాకపోవడంతో వారంతా ఆందోళనలకు సిద్ధమయ్యారు. మార్కెటింగ్ సొసైటీల్లో దాదాపు రెండు నెలలుగా జీతాలు అందలేదు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వేశాం.. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్న మాట ఇది. కానీ రేవంత్ చెప్తున్న మాటలకు, క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు పొంతన లేదు. వాస్తవ పరిస్థితులు రేవంత్ ప్రకటనకు భిన్నంగా ఉన్నాయి. ఇంకా చాలా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది. రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీలు, వ్యవసాయ మార్కెట్ సొసైటీల్లోని ఉద్యోగులు ఇంకా నెల జీతం కోసం ఎదురుచూస్తున్నారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీల వర్కర్లకు ఇంకా జీతాలు అందలేదు. ఇప్పటికీ జీతాలు రాకపోవడంతో వారంతా ఆందోళనలకు సిద్ధమయ్యారు. మార్కెటింగ్ సొసైటీల్లో దాదాపు రెండు నెలలుగా జీతాలు అందలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గత రెండు నెలలుగా జీతాల్లేక తెలంగాణ వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ల వద్ద ధర్నాలు చేస్తూ నిరసన తెలిపిన ఆశా వర్కర్లు.
— BRS Party (@BRSparty) February 10, 2024
పాలనపై దృష్టి పెట్టకుండా కాలక్షేపం చేస్తున్న రేవంత్ సర్కార్! pic.twitter.com/I7gJVjRk2X
శుక్రవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒకటో తారీఖునే జీతాలు చెల్లించామంటూ ప్రకటన చేశారు. ఇది గందరగోళానికి దారి తీసింది. రేవంత్ చేసిన ప్రకటన కేవలం సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిందా.. లేదా.. అన్ని ప్రభుత్వ సర్వీసుల అనుబంధ సంస్థలకు సంబంధించిందా.. అనే దానిపై క్లారిటీ లేకపోవడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. సోషల్‌మీడియాలో చాలా మంది ఉద్యోగులు ఇంకా తమకు జీతాలు అందలేదని పోస్టులు పెట్టారు. తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తెలంగాణలో దాదాపు 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులు, 23 వేల 391 మంది రిజిస్టర్డ్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, 33 వేల 843 మంది టీచర్లు, 27 వేల 990 మంది హెల్పర్లలో జీతాలు అందని జాబితా చాలా పెద్దగా ఉంది. వీటితో పాటు TSREIS, TSWREIS, TTWREIS మరియు TMREIS కింద 20,000 మందికి పైగా గురుకుల ఉద్యోగులు కూడా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక తెలంగాణ జాతీయ ఆరోగ్య మిషన్ విభాగంలో మూడు నెలలుగా జీతాలు అందలేదని తెలుస్తోంది.
ఒకటో తేదీన జీతాలు రిలీజ్ చేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. ఒకటో తేదీన జీతాలు ఇచ్చామనే ప్రకటన సత్యదూరమన్నారు. ఏడో తేదీన కూడా చాలా శాఖల్లో ఉద్యోగులకు జీతాలు అందలేదన్నారు. ఇక BSP స్టేట్ చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ట్విట్టర్‌లో గురుకుల ఉద్యోగులకు జీతాలు అందలేదనే విషయాన్ని ట్వీట్ చేశారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం లేదా అని ప్రశ్నించారు.