Telugu Global
Telangana

బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ అసంతృప్తి.. పార్టీకి గుడ్‌బై చెప్పే యోచన?

రాజాసింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీలోని ఒక వర్గం నాయకులు.. ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేయకుండా పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది.

బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ అసంతృప్తి.. పార్టీకి గుడ్‌బై చెప్పే యోచన?
X

తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ వ్యవహారం చిచ్చు రేపుతోంది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. తెలంగాణ ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించడంతో రాజా సింగ్ జైలు పాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన బెయల్‌పై విడుదలయ్యారు. అయితే రాజాసింగ్‌ను గతంలోనే బీజేపీ సస్పెండ్ చేసింది. గోషా మహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ వ్యవహారం ప్రస్తుతం బీజేపీలో కాకపుట్టిస్తోంది. తన సస్పెన్షన్ ఎత్తేయాలని రాజాసింగ్ బీజేపీని కోరినా సానుకూల స్పందన రాలేదు. కొన్నాళ్ల కిందట రాజాసింగ్ భార్య కూడా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి సస్పెన్షన్ ఎత్తేయాలని కోరారు. రాజా సింగ్ కూడా జరిగిన ఘటనపై పూర్తి వివరణ ఇచ్చారు. అయినా సరే సస్పెన్షన్ మాత్రం ఎత్తేయలేదు.

రాజాసింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీలోని ఒక వర్గం నాయకులు.. ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేయకుండా పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. పార్టీకి రాజాసింగ్ తిరిగి దగ్గర కాకుండా వాళ్లు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో రాజాసింగ్‌కు సంబంధాలు ఉన్నాయి. అయితే వాళ్లు రాజాసింగ్‌కు మద్దతుగా ఇప్పుడు మాట్లాడటం లేదు. ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడానికి ముందు అమిత్ షాను కలిశారు. అప్పుడు కూడా రాజాసింగ్ వ్యవహారం చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది.

రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పార్టీకి చాలా చెడ్డపేరు తీసుకొని వచ్చాయని.. బీజేపీకి తెలంగాణలో అలాంటి స్ట్రాటజీ లేదని.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీకి అలాంటి వారి వల్ల చెడ్డపేరు వస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తేసే విషయంలో ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ, అటు కేంద్ర నాయకత్వం కానీ సుముఖంగా లేనట్లు తెలుస్తున్నది. దీంతో రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీకి, రాజాసింగ్‌కు మధ్య దూరం పెరిగినట్లే కనిపిస్తున్నది.

బీజేపీ కనుక త్వరలో సస్నెన్షన్ ఎత్తేయకుంటే పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. రాజాసింగ్‌ను చేర్చుకోవడానికి ఏ పార్టీ కూడా సుముఖంగా లేదు. ఆయన కూడా రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. గోషామహల్ ప్రాంతంలో తనకు ఉన్న పరిచయాలు, హిందూ ఓట్లు తప్పకుండా గెలిపిస్తాయని రాజాసింగ్ నమ్ముతున్నారు. అవసరం అయితే ఏదైనా కొత్త వేదికను ఏర్పాటు చేసి.. దాని ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. త్వరలోనే రాజాసింగ్ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తారని సన్నిహితులు చెబుతున్నారు.మరి రాజాసింగ్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.

First Published:  27 Nov 2022 12:09 PM IST
Next Story