తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, వర్కర్లకు గుడ్ న్యూస్
రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఏప్రిల్ 30 నాటికి ఉద్యోగ విరమణ వయసుని 65 ఏళ్లుగా నిర్ధారించింది.
తెలంగాణలో ఇటీవలే ఆర్టీసీ కార్మికులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పీఆర్సీ విషయంలో గుడ్ న్యూస్ చెబుతామంది. ఇటీవల వివిధ నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపింది. తాజాగా.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. వారికి ఉద్యోగ విరమణ అవకాశం కల్పిస్తూ ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు.
అంగన్వాడీలకు వరాలు..
రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఏప్రిల్ 30 నాటికి ఉద్యోగ విరమణ వయసుని 65 ఏళ్లుగా నిర్ధారించింది. గతంలో వీరికి ఉద్యోగ విరమణ, తదనంతర ఆర్థిక ప్రతిఫలం అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండేది కాదు. కానీ, వారి కష్టాలను గుర్తించి ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసుని నిర్దేశించింది. విరమణ తర్వాత లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడానికి నిర్ణయించింది. అంగన్వాడీ టీచర్లకు లక్ష రూపాయలు, హెల్పర్లకు 50 వేల రూపాయలు.. ఉద్యోగ విరమణ తర్వాత అందజేస్తారు.
అంగన్వాడి టీచర్లకు హెల్పర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త.
— Satyavathi Rathod (@Satyavathi_BRS) August 25, 2023
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రలో ఉన్న 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ హెల్పర్లకు… pic.twitter.com/WMSt4nLEfN
ఆసరా పెన్షన్లు..
అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు రిటైర్మెంట్ తర్వాత ఆసరా పెన్షన్లు అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, వారికి జీతభత్యాలు కూడా సరిగా లేవని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. దేశంలోనే అంగన్వాడీలకు అత్యథిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ప్రస్తుతం తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నారు. ఇప్పుడు మినీ అంగన్వాడీలు అప్ గ్రేడ్ అయితే వారికి కూడా జీతం పెరుగుతుంది. తమకు ఆత్మగౌరవాన్ని కల్పించిన సీఎం కేసీఆర్ కు అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు కృతజ్ఞతలు తెలిపారు.
*