Telugu Global
Telangana

సికింద్రాబాద్ - తిరుపతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వందేభారత్ కోచ్‌ల రెట్టింపునకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

ప్రయాణికుల నుంచి ఈ ట్రెయిన్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం 8 కోచ్‌లతో నడుస్తున్న ఈ రైలు ఆక్యుపెన్సీ 120 నుంచి 130 శాతంగా నమోదవుతోంది.

సికింద్రాబాద్ - తిరుపతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వందేభారత్ కోచ్‌ల రెట్టింపునకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్
X

పుణ్యక్షేత్రమైన తిరుపతికి నిత్యం ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇక సెలవు రోజుల్లో ట్రెయిన్స్, బస్సుల్లో టికెట్లు కూడా దొరకవు. హైదరాబాద్ నగరం నుంచి తిరుపతికి ఎన్ని ట్రెయిన్స్ ఉన్నా.. ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. రిజర్వేషన్ కూడా చాలా రోజుల ముందే చేయిస్తే కాని సీట్లు దొరకవు. ఇటీవల సికింద్రాబాద్-తిరుపతి మధ్య హైస్పీడ్ రైలు 'వందే భారత్'ను ప్రవేశపెట్టారు. ప్రయాణికుల నుంచి ఈ ట్రెయిన్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం 8 కోచ్‌లతో నడుస్తున్న ఈ రైలు ఆక్యుపెన్సీ 120 నుంచి 130 శాతంగా నమోదవుతోంది.

వందే భారత్ సహా ఇతర రైళ్లకు తిరుపతి టికెట్లు దొరకడం కష్టం కావడంతో ప్రత్యేక రైళ్లను కూడా వేసింది. అయితే వందే భారత్‌ బోగీల సంఖ్య పెంచితే సమస్య కాస్త పరిష్కరించ వచ్చని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు అందాయి. తిరుపతి వెళ్లే వందేభారత్ ట్రెయిన్ కోచ్‌లను పెంచాలని చేసిన విజ్ఞప్తిని రైల్వే శాఖ దృష్టికి తీసుకొని వెళ్లారు. కేంద్రం కూడా ఓకే చెప్పడంతో వందే భారత్ రైలు బోగీలను 8 నుంచి 16కు పెంచడానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొన్నాళ్ల క్రితం మాట్లాడారు. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు బోగీల సంఖ్యను పెంచే విషయంపై మంత్రి ఆరా తీశారు. ఈ క్రమంలో రైల్వే బోర్డుకు జీఎం లేఖ రాశారు. రైల్వే బోర్డు నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో.. రైలు బోగీల సంఖ్య త్వరలోనే రెట్టింపు కానున్నాయి. కాగా, వందే భారత్ రైలు బోగీల పెంపునకు అంగీకరించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు మంత్రి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  9 May 2023 6:53 PM IST
Next Story