తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పండుగ నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సజ్జనార్ చెప్పారు. వాటిలో 50 బస్సులను వారం రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ హామీని అమలులోకి తేవడంతో బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు బస్సులు మరిన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్టు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుక్రవారం వెల్లడించారు. హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం ఆయన ఈ వివరాలు తెలిపారు.
ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పండుగ నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సజ్జనార్ చెప్పారు. వాటిలో 50 బస్సులను వారం రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేస్తుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు.
అంతేకాదు.. ట్విట్టర్ వేదికగా సజ్జనార్ మరో విషయాన్ని కూడా వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2 వేలకు పైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయని వివరించారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను ఆర్టీసీ యాజమాన్యం వాడకంలోకి తెస్తోందని పేర్కొన్నారు. వీటిన్నిటినీ 2024 మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు.