Telugu Global
Telangana

కల్లు గీత కార్మికుల శుభవార్త.. రూ.5 లక్షల బీమా అమలుకు సీఎం కేసీఆర్ నిర్ణయం

కల్లు గీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీత కార్మిక కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయాన్ని.. నేరుగా వారి ఖాతాలో జమ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.

కల్లు గీత కార్మికుల శుభవార్త.. రూ.5 లక్షల బీమా అమలుకు సీఎం కేసీఆర్ నిర్ణయం
X

కల్లు గీత కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు మరణిస్తే వారి కుటుంబం అనాథలు కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వమే రైతు బీమా అందిస్తోంది. ఇకపై ఇలాంటి బీమా సౌకర్యం కల్లు గీత కార్మికులకు కూడా కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కల్లు గీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీత కార్మిక కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయాన్ని.. నేరుగా వారి ఖాతాలో జమ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతులకు ఇస్తున్న మాదిరిగానే కల్లు గీత కార్మికుల కుటుంబాలకు బీమా సాయాన్ని అందించే అంశానికి సంబంధించిన విధి విధానాలను వెంటనే రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి దురదృష్ణకరమైన సంఘటనలు ఎప్పుడు జరుగుతాయో ఊహించలేము. అలాంటి సందర్భంలో ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులకు అమలు చేస్తున్న తరహాలోనే కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో పారిశుథ్య కార్మికులకు వేతనాలు పెంపు, గర్భిణీ స్త్రీలను పౌష్టికాహార లోపం నుంచి బయటపడేయడానికి న్యూట్రిషన్ కిట్ల వంటి శుభవార్తలు వరుసగా చెప్పిన సీఎం కేసీఆర్.. తాజాగా గీత కార్మిక కుటుంబాలకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. దీని వల్ల కుటుంబంలో కల్లు గీత వృత్తిలో ఎవరైనా ఉండి, ప్రమాదవశాత్తు చనిపోతే బీమా అందుతుంది. దీని వల్ల కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఆసరాగా ఉండనున్నది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల కల్లు గీత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


First Published:  2 May 2023 7:51 PM IST
Next Story