రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో ఆ ప్రయోగం సక్సెస్
తెలంగాణ వ్యవసాయ యూనివర్శిటీ పరిశోధనలు రైతుల కష్టాలు తీర్చడమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రెండు చోట్లా రైతులు నష్టపోయారు. కానీ తెలంగాణలో మాత్రం 6 లక్షల ఎకరాల్లో వరి, వడగళ్లను తట్టుకుని నిలబడింది. దీనికో ప్రత్యేక కారణం ఉంది. ఈ 6 లక్షల ఎకరాల్లో జేజీఎల్–24423 రకం వరిని సాగు చేశారు. ఇది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్శిటీ తయారు చేసిన మేలిమిరకం. మిగతా అన్నిచోట్లా వడగళ్లకు కడగళ్లే మిగలగా జేజీఎల్–24423 రకం మాత్రం వడగళ్లు, ఈదురుగాలులను తట్టుకుని నిలబడింది.
వ్యవసాయ వర్శిటీ పరిధిలోని జగిత్యాల పొలాస పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు 2019లో ఈ రకం వరి వంగడాలను ప్రవేశ పెట్టారు. 2022–23 వానాకాలం సీజన్‌లో దాదాపు 7 లక్షల ఎకరాల్లో సాగు చేశారు రైతులు, మంచి ఫలితం అందుకున్నారు. యాసంగిలో 6 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇటీవల ఈదురు గాలులు, వడగళ్ల వానలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వరి పడిపోయింది, గింజలు నేలరాలాయి. కానీ జీజీఎల్–24423 రకం వరి మాత్రం 90శాతం వరకు తట్టుకుని నిలిచినట్టు వ్యవసాయ వర్శిటీ వర్గాలు తెలిపాయి.
అందుబాటులో ఉన్న జేజీఎల్–24423 రకంతోపాటు, త్వరలో మరో ఏడు రకాల కొత్త వంగడాలను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. జేజీఎల్–24423 వరి వెరైటీని జగిత్యాల రైస్–1 అని కూడా అంటారు. ఎంటీయూ 1010, ఎన్‌ఎల్‌ఆర్–34449 రకాలని సంకరం చేసి దీనిని అభివృద్ధి చేశామంటున్నారు శాస్త్రవేత్తలు.
ఇది వానాకాలం, యాసంగి సీజన్లకు అనుకూలమైనదని చెబుతున్నారు. ఈ వరి ఎత్తు తక్కువగా, కాండం ధృఢంగా ఉండటం వల్ల ఈదురుగాలులు, వడగళ్లకు పంట నేలకొరిగే అవకాశమే లేదంటున్నారు. యాసంగిలో చలిని సమర్థంగా తట్టుకోవడం వల్ల నారు ఆరోగ్యవంతంగా పెరుగుతుందని, దమ్ము చేసిన మడిలో నేరుగా వెదజల్లే పద్ధతి కూడా దీనికి అనుకూలం అంటున్నారు.
ఈ ధాన్యానికి మార్కెట్లో గ్రేడ్–ఎ కింద మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. దిగుబడి ఎక్కువ, పెట్టుబడి ఖర్చు తక్కువ కావడంతో కర్నాటక, ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ రకం పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద తెలంగాణ వ్యవసాయ యూనివర్శిటీ పరిశోధనలు రైతుల కష్టాలు తీర్చడమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచాయి.