Telugu Global
Telangana

రైతులకు గుడ్ న్యూస్.. 12వ తేదీ నుంచి రైతులకు పరిహారం పంపిణీ

గతంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను స్వయంగా సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పంట పొలాలను సందర్శించి అక్కడే పరిహారం ప్రకటించారు.

రైతులకు గుడ్ న్యూస్.. 12వ తేదీ నుంచి రైతులకు పరిహారం పంపిణీ
X

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారాన్ని త్వరలోనే పంపిణీ చేయనున్నారు. గతంలో కురిసిన వర్షాల సమయంలో నష్టపోయిన రైతులతో పాటు, ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన రైతులందరికీ ఒకే సారి నష్టపరిహారం పంపిణీ చేయనున్నారు. ఈ నెల 12 నుంచి పరిహారం చెక్కులను రైతులకు అందజేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.

గతంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను స్వయంగా సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పంట పొలాలను సందర్శించి అక్కడే పరిహారం ప్రకటించారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతులందరికీ అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కౌలు రైతులకు కూడా పరిహారం అందేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇక తాజాగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలో వడగండ్ల వానలు మరోసారి రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. గత వారం మంత్రిక కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో కూడా పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు.

రైతులందరికీ ఒకే సారి పంట నష్టం చెక్కులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే నష్టపోయిన కౌలు రైతు వివరాలను కూడా ప్రభుత్వానికి అందించారు. ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వ పెద్దలు భరోసా ఇచ్చారు. గతంలో ప్రకటించినట్లు అకాల వర్షాల కారణంగా పాడైన పంటలకు పరిహారం 12వ తేదీ నుంచి అందించనున్నారు.

First Published:  4 May 2023 5:48 PM IST
Next Story