Telugu Global
Telangana

తెలంగాణలో ఎడిబుల్‌ ఆయిల్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టనున్న గోద్రెజ్‌

గోద్రెజ్ ఆగ్రోవెట్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ సింగ్ యాదవ్ హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో ఈ రోజు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఆయన ఖమ్మం జిల్లాలో పెట్తుబడి పెడుతున్నట్టు ప్రకటన చేశారు.

తెలంగాణలో ఎడిబుల్‌ ఆయిల్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టనున్న గోద్రెజ్‌
X

భారతదేశంలోనే అతిపెద్ద ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కంపెనీ అయిన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్, ఖమ్మం జిల్లాలో ఎడిబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. గంటకు 30 టన్నుల ఉత్పత్తి చేయగల ప్రతిపాదిత ఈ ప్లాంట్ ను గంటకు 60 టన్నుల ఉత్పత్తి చేసేవిధంగా విస్తరించవచ్చు. ఖమ్మం జిల్లాలో ఇదే అతిపెద్ద ప్రైవేట్ పెట్టుబడి. ఇది పామాయిల్‌ను ప్రాసెస్ చేస్తుంది.

ఈ అంశంపై చర్చిందేకు గోద్రెజ్ ఆగ్రోవెట్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ సింగ్ యాదవ్ హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో ఈ రోజు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఆయన ఖమ్మం జిల్లాలో పెట్తుబడి పెడుతున్నట్టు ప్రకటన చేశారు.

గోద్రెజ్ అగ్రోవెట్ ప్రతిపాదిత ప్లాంట్ 2025-26 నాటికి పూర్తి స్థాయిలో పనిచేయాలని యోచిస్తోంది. ఈ ప్లాంట్ విద్యుత్ అవసరాల కోసం కో-జనరేషన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తుంది. పామాయిల్ రైతులకోసం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 10 మండలాల్లో పది గోద్రెజ్ సమాధాన్ కేంద్రాల ద్వారా సేవలు అందించనున్నారు. ప్రస్తుతం ఒక కేంద్రం ఉందని, మరో 9 కేంద్రాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని గోద్రేజ్ అధికారులు తెలిపారు.

గోద్రెజ్ ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ప్లాంట్ వల్ల‌ ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుంది. పశుగ్రాసం, ఆక్వా ఫీడ్, ఆగ్రోకెమికల్స్, పౌల్ట్రీ ప్రాసెసింగ్, డైరీతో రైతుల ఉత్పాదకతను మెరుగుపరచడం కూడా దీని లక్ష్యం.

రాష్ట్రంలో దీర్ఘకాలికంగా 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్‌ను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చమురు దిగుమతిని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ తోటలను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వపు కృషి ఫలితంగా తెలంగాణలో నూనె గింజల ఉత్పత్తి అద్భుతంగా మెరుగు పడింది.

కాగా తెలంగాణలో రూ.400 కోట్లతో చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో హైదరాబాద్‌కు చెందిన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా (జీఈఎఫ్) ప్రకటించింది.

First Published:  5 Jan 2023 2:16 PM GMT
Next Story