Telugu Global
Telangana

భద్రాచలం వద్ద ప్రమాదకరంగా గోదావరి.. ఆర్మీ సాయం కోరిన తెలంగాణ ప్రభుత్వం

గోదావరిలో సాయంత్రానికి వరద 70 అడుగులు దాటి ప్రవహిస్తోందని తెలిసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.

భద్రాచలం వద్ద ప్రమాదకరంగా గోదావరి.. ఆర్మీ సాయం కోరిన తెలంగాణ ప్రభుత్వం
X

ఎగువ తెలంగాణ, మహారాష్ట్రలో పడుతున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు 68.30 అడుగుల ఎత్తున వరద నీరు నదిలో ప్రవహించగా.. సాయంత్రానికి 70 అడుగులు దాటేసి మరింత ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం నదిలో 23 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. వరద మరింత పెరిగే అవకాశం ఉన్నదని, 75 అడుగుల వరకు చేరుకుంటుదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే గోదావరికి ఇరువైపులా ఉన్న బూర్గంపాడు, భద్రాచలం పట్టణం చుట్టూ నీళ్లతో నిండిపోయాయి. భద్రాచలం ఒక దీవిలా తయారైంది. ప్రజలు కరెంటు లేక, వరద నీరు ఇళ్లలో చేరడంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇప్పటికే బూర్గంపాడు, సారపాక, నాగినేనిప్రోలు, రెడ్డి పాలెం గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 200పైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్వయంగా భద్రాచలంలో పర్యటించి వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పట్టణంలోని ఏఎంసీ కాలనీ, సుభాష్ నగర్, శాంతి నగర్ ప్రాంతాల్లో పర్యటించి, వరదలో మునిగిన ఇళ్లను పరిశీలించారు. ఇప్పటికే వరద బాధితుల కోసం క్యాంపులు ఏర్పాటు చేశామని, వారికి అక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి పువ్వాడ చెప్పారు.

గోదావరి కరకట్టకు ముందు భాగం నుంచి వరద పట్టణంలోకి ప్రవేశించిందని, కరకట్టకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని మంత్రి చెప్పారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి కాలరీస్‌కు చెందిన రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి వరద సహాయక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు భద్రాచలంలో వరద ఉధృతి పెరుగుతుండటంతో ఆర్మీ సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించడానికి తగిన సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆర్మీ కూడా ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలు..

గోదావరిలో సాయంత్రానికి వరద 70 అడుగులు దాటి ప్రవహిస్తోందని తెలిసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆర్మీ రంగంలోకి దిగింది. 100 మంది ఆర్మీ సిబ్బంది భద్రాచలం వరద సాయం కోసం వస్తున్నట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఇక వరద సహాయక చర్యల పర్యవేక్షణ కోసం నలుగురు స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణాన్ని ఆనుకొని ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపులోకి వరద ముంచెత్తడంతో.. వాళ్లు అక్కడి నుంచి వెపన్స్, ఇతర సామగ్రిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.

గోదావరి వరద ఇలా..

గోదావరికి 1953లో 72.5 అడుగుల మేర వరద వచ్చింది. అప్పట్లో సీతారామ చంద్రస్వామి దేవస్థానం తప్ప, మిగిలిన ప్రాంతమంతా మునిగిపోయింది. గోదావరి నదికి సాధారణంగా అగస్టు నెలలో వరదలు వస్తాయి. కానీ ఈ సారి జూలై నెలలోనే భారీ వరద రావడం ఒక రికార్డు అని అధికారులు చెప్తున్నారు.

1958 - 68

1959 - 67

1966 - 65.9

1970 - 59.5

1983 - 63.5

1986 - 75.6

1990 - 70.8

2006 - 66.9

2013 - 61.6

2020 - 31.6

ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే..

తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటం.. రాబోయే 24 గంటల్లో వరద మరింతగా పెరుగుతుందని అధికారులు చెప్తుండటంతో.. దిగువన ఉన్న ఏపీ కూడా అప్రమత్తమైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గోదావరి లోతట్టు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. మంత్రి అంబటి రాంబాబు పోలవరం వద్దకు వెళ్లి పరిస్థితి పరిశీలించారు. రాజమండ్రి, ధవళేశ్వరం, కోటిపల్లి వద్ద వరదను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను వెంటనే యుద్ధ‌ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

First Published:  15 July 2022 2:03 PM GMT
Next Story