Telugu Global
Telangana

గోదావరి ఉగ్ర రూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలంలోని అన్నదాన సత్రం, సుభాష్‌ నగర్‌ కాలనీ, కొత్త కాలనీలోకి వరద నీరు రాకుండా అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి బ్యాక్‌ వాటర్‌ను ఎప్పటికప్పుడు తోడి బయటకు పోస్తున్నారు.

గోదావరి ఉగ్ర రూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
X

ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 7 గంటలకు నీటి మట్టం 53.6 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, కూనవరం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లోని చాలా గ్రామాలు గత వారం రోజుల నుంచి వరద ముంపులోనే ఉన్నాయి. పట్టణ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవడంతో నిత్యావసరాలకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్ల ఇంకా కొంతమేర నీటిమట్టం పెరగవచ్చని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. భద్రాచలంలోని అన్నదాన సత్రం, సుభాష్‌ నగర్‌ కాలనీ, కొత్త కాలనీలోకి వరద నీరు రాకుండా అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి బ్యాక్‌ వాటర్‌ను ఎప్పటికప్పుడు తోడి బయటకు పోస్తున్నారు. మరోవైపు కూనవరం రోడ్డులో నిర్మిస్తున్న నూతన గోదావరి కరకట్ట వద్ద వరద నీరు పట్టణంలోకి రానీయకుండా అధికారులు జాతీయ రహదారిపై మట్టి పోసి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తి వేసి 11 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద నీటి ఉధృతి పెరగడంతో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో లంక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకు వచ్చింది. పల్లపు ప్రాంతాల్లోని ఇళ్లన్నీ నీటమునిగాయి. ఇప్పటికే పంట చేలు చెరువులను తలపిస్తున్నాయి. గోదావరిలోకి భారీగా చేరుతున్న నీటితో ఆదివారం ఉధృతి మరింత పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.

First Published:  28 July 2024 6:06 AM GMT
Next Story