రైతన్నలకు భరోసా ఇవ్వండి.. బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు
ప్రభుత్వ అధికారులతో కలసి పార్టీ నాయకులు అక్కడకు వెళ్లి రైతులకు భరోసా ఇవ్వాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి పరిశీలించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న రైతన్నలకు భరోసాను ఇవ్వడమే కాకుండా.. వారికి విశ్వాసం కలిగించేలా మమేకం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిని సమన్వయ పరుస్తున్న ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు, ప్రజాప్రతినిధులతో ఆయన సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు.
అకాల వర్షాల కారణంగా ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. కొంత పంట నష్టం కూడా జరిగినట్లు తెలుస్తున్నదని అన్నారు. ప్రభుత్వ అధికారులతో కలసి పార్టీ నాయకులు అక్కడకు వెళ్లి రైతులకు భరోసా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులతో పాటు.. పంచాయతీరాజ్ శాఖ, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను త్వరిత గతిన పరిష్కరించుకునేలా చూడాలని కేటీఆర్ సూచించారు.
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నిర్మించిన రోడ్లకు సంబంధించిన అంశాలపై కూడా పార్టీ శ్రేణులు దృష్టి సారించాలని కేటీఆర్ కోరారు. వర్షాకాలం లోపు వీటికి సంబంధించిన పనులు పూర్తయ్యేలా చూడాలని స్వయంగా సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ఉపాధి హామీకి సంబంధించిన బిల్లులు ఆలస్యం అయ్యిందనేది వాస్తవమని.. కేంద్రం రూ.1300 కోట్లను ఇంకా పెండింగ్‌లో పెట్టడం వల్లే ఇలా జరిగిందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలను మహిళలకు అందేలా చూడాలని కేటీఆర్ సూచించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ తరపున నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు అన్నీ ఏప్రిల్ 29 నాటికి పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ సీఎం కేసీఆర్ ప్రత్యేక సందేశాన్ని పంపిస్తున్నారు. దాన్ని ప్రతీ సమ్మేళనంలో చదివి వినిపించాలని కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి పంపిస్తున్న ఈ ప్రత్యేక సందేశం ప్రతీ కార్యకర్తకు చేరేలా చూడాలని కేటీఆర్ కోరారు. ఉద్యమ కాలం నుంచి పార్టీకి అండగా ఉన్న ప్రతీ కార్యకర్త ఈ సందేశాన్ని వినాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ ఆత్మీయ సమ్మేళనాలలో ప్రతీ కార్యకర్త ప్రాధాన్యతను వివరించాలని కేటీఆర్ బాధ్యులకు సూచించారు. పార్టీతో వారికి ఉన్న అనుబంధాన్ని తెలియజేయాలని చెప్పారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాక ముందు ఉన్న పరిస్థితులు, రాబోయే రోజుల్లో తెలంగాణ ఎదుర్కొనబోయే పరిస్థితులు, ఇప్పుడు మారిన ముఖ చిత్రాన్ని గుర్తు చేసుకోవాలని కేటీఆర్ తెలిపారు.
ఇక ప్రధాని మోడీ, బీజేపీ హయాంలో దేశంలో పెరిగిన ధరలకు సంబంధించి విస్తృత చర్చ జరగాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. మోడీ ప్రభుత్వ హయాంలో పెరిగి పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలను వారి విధానాల వైఫల్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. దేశ ప్రజలతో పాటు, తెలంగాణకు ప్రధాని మోడీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని.. రాష్ట్రానికి నిధులు రాకుండా చేస్తున్న మోసాన్ని వివరించాలని కేటీఆర్ చెప్పారు. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులపై ఉందని కేటీఆర్ చెప్పారు.