Telugu Global
Telangana

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా "గిఫ్ట్ ఎ స్మైల్"

భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఏడాది తాను పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. వరదలతో ప్రజలు కష్టాల్లో ఉన్నందున, తాను సంబరాలు చేసుకోలేనని స్పష్టం చేశారు.

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్
X

రాజకీయ నాయకులు, సినీ తారల పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. గజమాలలు, పూల బొకేలు, స్వీట్ బాక్స్ లు, శాలువాలు... ఇతరత్రా గిఫ్ట్ లతో నాయకులను కలిసేందుకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు బారులు తీరుతుంటారు. అలాంటి ఆడంబరాలు ఏవీ వద్దని, ఈ ఏడాది భారీ వర్షాల నేపథ్యంలో తాను పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. వరదలతో ప్రజలు కష్టాల్లో ఉన్నందున, తాను సంబరాలు చేసుకోలేనని స్పష్టం చేశారు.

గిఫ్ట్ ఎ స్మైల్

ఈనెల 24న కేటీఆర్ 46వ ఏట అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన బర్త్ డే వేడుకలను భారీ ఎత్తున నిర్వహించడానికి పార్టీ నాయకులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వారం ముందుగానే వారోత్సవాలు మొదలయ్యాయి. #HBDKTR అనే హ్యాష్ ట్యాగ్ ఆల్రడీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అయితే కేటీఆర్ మాత్రం తాను ఈ వేడుకలకు దూరం అంటున్నారు. తన పుట్టినరోజున జిల్లాల్లో కూడా వేడుకలు చేయొద్దని, దానికి బదులు వరద బాధితులను ఆదుకోవాలని అభిమానులకు సూచించారు. `గిఫ్ట్ ఎ స్మైల్` పేరుతో వరద బాధితులకు సహాయం చేయాలని, వారి చిరునవ్వే తన పుట్టినరోజుకి అభిమానులిచ్చే పెద్ద గిఫ్ట్ అని అంటున్నారు కేటీఆర్.

ఇప్పటికే వరద బాధితులను ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించి ఆర్థిక సాయం, వస్తు సాయం చేస్తోంది. దీనికి తోడు టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ తమవంతు సాయం చేస్తున్నారు. తాజాగా మరోసారి భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరో 4 రోజులపాటు వరద కష్టాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ దశలో హంగు ఆర్భాటాలతో తన పుట్టినరోజు జరుపుకోవ‌డానికి కేటీఆర్ ఇష్టపడడం లేదు. ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు.. జిల్లాల్లో సంబరాలు చేసే బదులు, స్థానిక ప్రజలకు సాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

First Published:  23 July 2022 11:51 AM IST
Next Story